Saturday, July 4, 2026
E-PAPER
Homeఖమ్మంవర్షానికి కూలిన పేద మహిళ ఇల్లు.. 

వర్షానికి కూలిన పేద మహిళ ఇల్లు.. 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రకృతి కన్నెర్ర చేస్తే పేదవాడి జీవితం ఎలా ఛిన్నాభిన్నం అవుతుందో చెప్పడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దబ్బతోగు కాలనీలో జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓ పేద మహిళ నివసిస్తున్న తాటాకు ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో ఆ కుటుంబం నిలువ నీడ కోల్పోయి రోడ్డున పడింది.

దబ్బతోగు కాలనీకి చెందిన సున్నం శ్రీదేవి నివసిస్తున్న తాటాకు ఇల్లు వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది.మట్టి గోడలు నీటితో నానిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఘటన సమయంలో ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, ధాన్యం, ఇతర సామగ్రి మట్టి దిబ్బల కింద పడి పూర్తిగా దెబ్బతిన్నాయి.

బాధితురాలు సున్నం శ్రీదేవి మాట్లాడుతూ, “రెక్కాడితే గానీ డొక్కాడని మా కుటుంబానికి ఈ వర్షం కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఉన్న ఒక్క చిన్న ఇల్లు కూడా కూలిపోయింది. ఇప్పుడు తలదాచుకునే చోటు లేదు. చిన్నపిల్లలతో ఈ వానలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. రోడ్డుపైనే చలి, వానను తట్టుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు అండగా నిలవాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, తాత్కాలిక నివాస వసతి కల్పించాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ గృహ పథకాల కింద శాశ్వత ఇల్లు మంజూరు చేసి సున్నం శ్రీదేవి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -