30 మందికిపైగా మృతి …బలూచిస్థాన్ ప్రకటన
లాహోర్ : పాకిస్తా న్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మరో భారీ దాడి జరిగినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. గ్వాదర్ జిల్లాలోని జీవానీ పరిధిలో ఉన్న పన్వాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఘటనలో 30 మందికిపైగా భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరికొందరు గాయపడ్డారని పేర్కొంది. అయితే బీఎల్ఏ చేసిన ఈ ప్రకటనపై పాకిస్థాన్ సైన్యం లేదా కోస్ట్ గార్డ్స్ నుంచి అధికారిక ధ్రువీకరణ రాలేదు.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జులై 3న సాయంత్రం 6.32 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. తమ మజీద్ బ్రిగేడ్‌కు చెందిన సభ్యుడు పేలుడు పదార్థాలతో నింపిన మాజ్డా వాహనాన్ని కోస్ట్ గార్డ్స్ క్యాంపులోకి తీసుకెళ్లి పేల్చినట్లు బీఎల్ఏ పేర్కొంది. ఈ భారీ పేలుడు కారణంగా కోస్ట్ గార్డ్స్ క్యాంపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. పేలుడు అనంతరం తమ ఫతేహ్ స్క్వాడ్‌కు చెందిన సభ్యులు క్యాంపుపై దాడి చేసినట్లు వెల్లడించింది. పేలుడు నుంచి బయటపడిన భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించినట్టు పేర్కొంది.
ఈ ఘటనలో 30 మందికిపైగా పాకిస్తా న్ భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు బీఎల్ఏ ప్రకటించింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే పాకిస్థాన్ సైన్యం లేదా కోస్ట్ గార్డ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దాడిలో ఎంత మంది మరణించారు? ఎంత మంది గాయపడ్డారు? క్యాంపునకు ఎంత మేర నష్టం జరిగింది? అనే వివరాలపై స్పష్టత రాలేదు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలను కూడా బీఎల్ఏ తన ప్రకటనలో వెల్లడించింది. అతడిని అత్తావుల్లా బలోచ్ అలియాస్ అజ్మల్‌గా పేర్కొంది.
పాక్ కోస్ట్ గార్డ్స్ క్యాంపుపై భారీ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



