Sunday, July 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅప్పులపై భట్టివన్నీ అబద్ధాలే

అప్పులపై భట్టివన్నీ అబద్ధాలే

- Advertisement -

ఆరు గ్యారంటీల అమలు
తప్పించుకోవడానికే గోబెల్స్‌ ప్రచారం
బీఆర్‌ఎస్‌ పదేండ్లలో చేసిన అప్పు రూ.4.17 లక్ష‍ల కో‌ట్లే
రెండున్నరేండ్లలో కాంగ్రెప్‌ అప్పు రూ.4.50 లక్ష‍ల కోట్లు
ఎక్కడైనా చర్చకు సిద్ధం.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి : మాజీమంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో చేసిన అప్పులపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అబద్ధాలు, అర్థసత్యాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి హరీశ్‌రావు ‌విమర్శించారు. శనివారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పులపై అంకెల గారడీ తప్ప వాస్తవాలను చెప్పలేదని తెలిపారు. భట్టికి వాస్తవాలు తెలియదని అనుకోవడం లేదన్నారు. వాస్తవాలు తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఆరు గ్యారంటీల అమలు నుంచి తప్పించుకోవడం కోసమే ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.8,21,651 కోట్లు అని భట్టి కట్టుకథ చెప్పారన్నారు. 2014 జూన్‌ ‌2 నాటికి ఎఫ్‌ఆర్‌‌బీఎం రుణాలు, ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.84,628 కోట్లు బీఆర్‌ఎస్‌ ‌ఖాతాలో చూపారని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023, డిసెంబర్‌ 7 నుంచి 2024 మార్చి 31 వరకు తెచ్చిన అప్పులు రూ.15,118 కోట్లు కూడా బీఆర్‌ఎస్‌ అప్పుల్లో కలిపారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేయకపోయినా రూ.99,386 కోట్లు తమ ఖాతాలో కలిపారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2023, డిసెంబర్‌ 7నాటికి ప్రభుత్వంపై ఉన్న అప్పు రూ.5,16,881 కోట్లు అని భట్టి వివరించారనీ, అందులోనుంచి రూ.99,386 కోట్లు తీసివేస్తే పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన అప్పు రూ.4,17,495 కోట్లు అని స్పష్టం చేశారు. కాగ్‌ ‌లెక్కల ప్రకారమైతే రూ.4,10,819 కోట్ల అప్పు చేసినట్టు గణాంకాలున్నాయని వివరించారు. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్‌, సీతారామ కార్పొరేషన్‌, పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్‌, మిషన్‌ ‌భగీరథ కూడా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, బడ్జెట్‌ ‌గణాంకాలు, కాగ్‌ ‌నివేదిక, ఎకనామిక్‌ ‌సర్వే ప్రకారం చేసినా బీఆర్‌ఎస్‌ ‌హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్ష‍ల కోట్లు దాటలేదని వివరించారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో చెప్పానని గుర్తు చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమనీ, దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలను పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మ‌రల్చడం కోసమే స్కాంల నుంచి డైవర్షన్ చేయడం కోసమే అప్పుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ ‌అప్పు రూ.3.47 లక్ష‍ల కోట్లన్న సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌‌బీఎంతోపాటు అన్ని రకాల అప్పులు కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి రూ.3,47,294 కోట్లు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. నాలుగు నెల్లలో అప్పు ఎట్ల తగ్గిందని ప్రశ్నించారు. గతనెల 30 నాటికి పబ్లిక్ డొమైన్‌‌లో ఉన్న లెక్కల ప్రకారం 31 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.4.50 లక్ష‍ల కోట్లని వివరించారు. ఈ అప్పులు దొంగదారిన లంచాలు ఇస్తూ తెస్తున్నారని విమర్శించారు.
రూ.వేల కోట్ల అప్పులు ఎఫ్ఆర్‌‌బీఎం పరిధిలోకి రాకుండా, రూ.వందల కోట్లు లంచాలు (బ్రోకర్ కమీషన్లు) ఇచ్చి తెస్తున్నారని అన్నారు. రూ.70 వేల కోట్ల అప్పు కోసం రేవంత్ రెడ్డి బ్రోకర్లకు ఇచ్చే లంచం రూ.1,200 కోట్లని చెప్పారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయంపై సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌‌ను విచారణ చేపట్టాలని భట్టి ఆదేశించడం దొంగకే విచారణ చేసుకోమ్మని చెప్పినట్లుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, నాయకులు అల్లిపురం వెంకటేశ్వర్‌‌రెడ్డి, మన్నె గోవర్ధన్‌‌రెడ్డి, రాకేశ్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -