సర్ పేరిట పౌర హక్కుల విధ్వంసం
ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకోవడం లేదు
ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేస్తోంది
ప్రజాస్వామ్యానికి ఇది పెను ప్రమాదం : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
భారత దేశంలో మళ్లీ బ్రిటిష్ పాలనను తీసుకొచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్క్షాన కేంద్రంలో తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సర్’పై అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 1935లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన కొంతమంది (ఆర్థికంగా ఉన్నవారు, రాజ కుటుంబాలు, ఉన్నతాధికారులు మొదలగు వారు)కి మాత్రమే ఓటు హక్కు కల్పించిందన్నారు. 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాకిస్తాన్ నుంచి వలసలు జరుగుతున్న సందర్భంలో సైతం దేశంలో ఓటు హక్కును ప్రభుత్వమే పారదర్శకంగా ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ నేడు పౌరులు తమ ఓటు హక్కును తామే రక్షించుకునే పరిస్థితులను కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకోవడం లేదనీ, ప్రభుత్వాలే ఓటర్లను ఎంపిక చేస్తున్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని హెచ్చరించారు. సర్ ప్రక్రియ జరిగిన రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఎందుకు మారాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ర్టంలో ‘సర్ ’ప్రక్రియపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీఎల్‌ఓలకు కనీస శిక్షణ ఇవ్వకుండా సర్‌లో భాగస్వామ్యం చేశారని ఆరోపించారు. ఓటర్ నమోదు ఫారం నింపడం ఎలాగో తెలియడం లేదని అన్నారు. తెలంగాణ పౌర సమాజం ‘సర్’ ప్రక్రియపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సర్ పేరుతో జరుగుతున్నది ఓటర్ నమోదు ప్రక్రియ కాదనీ, పౌరసత్వ నమోదని తెలిపారు. భారతీయులుగా తమను తాము నిరూపించుకునే ప్రక్రియను కేంద్రం దొడ్డి దారిన చేపట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన పత్రాలు సమర్పించలేదనే కారణంతో టెలిగ్రాఫ్ ఎడిటర్ రాజగోపాల్ ఓటు హుక్కును బెంగాల్‌లో తొలగించారని గుర్తు చేశారు. ఇతర దేశాలకు వెళ్లే క్రమంలో ఓటు హక్కు లేదనే కారణంతో ఆయన పాస్ పోర్టును తిరస్కరించారని తెలిపారు. ఆయన ఎడిటర్ గిల్డ్స్‌కు లేఖ రాసినా స్పందన లేదని అన్నారు. అలాంటి స్థాయిలో ఉన్న వారే ఓటు హక్కు కోసం పోరాడుతుంటే సామాన్యుడి పరిస్థితేంటని ప్రశ్నించారు. ఓటు హక్కులేదనే కారణంతో పేదలు రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ దేశంలోని పేదలు, మహిళలు, బడుగు బలహీనవర్గాలు, మైనార్టీల ఓట్లను తొలగించేందుకు బీజేపీ సర్కారు పన్నుతున్న కుట్రే… సర్ అని పేర్కొన్నారు. తమకు నచ్చని వారి ఓట్లను తొలగించడం ద్వారా ఆ పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ప్రజాస్వామ్య దేశంలో గంపగుత్తగా ఓట్లను తొలగించే కుట్ర జరగలేదన్నారు. ఈ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా మందికి ఓటరు నమోదు ఫారాలను అందించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు. బీఎల్‌ఓలు ఓటర్ల వద్దకు కాకుండా….ఓటర్లే బీఎల్‌ఓలను వెతికే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. సర్ ఓటర్ల నమోదు ప్రక్రియ గడువును పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక సభ్యులు సౌమ్య కిదాంబి, మేరీ డయాస్ సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు.
భారత్‌లో బ్రిటిష్ పాలనకు బీజేపీ కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



