భూ సీలింగ్ చట్టాల సమీక్ష చేయాలి
భూమిలేని పేదలకు
హక్కులు కల్పించాలి
ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా
జైల్ భరో : ఏఐఏడబ్ల్యూయూ
ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవ తెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
భూ కేంద్రీకరణకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక ఉద్యమం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని, నేడు కొత్త రూపంలో కొనసాగుతున్న భూ, సంపద కేంద్రీకరణను అడ్డుకోవడమే ఆ పోరాటానికి కొనసాగింపని వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. పేదలకు భూమి, కౌలుదారులకు హక్కులు, ఉపాధి హామీ కార్మికులకు న్యాయం, కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్డి కొమురయ్య అమరత్వంతో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతమై, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రైతాంగం చారిత్రక పోరాటాన్ని సాగించిందని గుర్తు చేశారు. ఆ పోరాటం వల్ల భూ సంస్కరణలపై చర్చ ప్రారంభమైనప్పటికీ, ఇప్పటికీ భూమి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండటం ఆందోళనకరమన్నారు. భూ గరిష్ట పరిమితి (ల్యాండ్ సీలింగ్) చట్టాలను సమూలంగా పున:సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో సాగునీటి వసతులు లేని పరిస్థితుల్లో ఒక కుటుంబానికి పెద్ద ఎత్తున భూమి కలిగి ఉండేందుకు అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు ప్రాజెక్టులు, సాగునీటి సదుపాయాలు పెరిగిన పరిస్థితుల్లో అదే విధానాన్ని కొనసాగించడం సమంజసం కాదన్నారు.
అసైన్‌మెంట్ భూములను సాగు చేస్తున్న వారికి పూర్తి హక్కులు కల్పించాలని, కౌలుదారులకు రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థికాభివృద్ధి భారీ నగరాల నిర్మాణంతో కాకుండా ప్రజల కొనుగోలు శక్తి పెరగడం ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. అందుకు భూ వికేంద్రీకరణ తప్పనిసరి అని స్పష్టం చేస్తూ ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ దేశ సంపదను దోచుకెళ్లిందని, నేడు స్వదేశీ పేరుతో పనిచేస్తున్న పెద్ద కార్పొరేట్ సంస్థలు విదేశీ పెట్టుబడిదారులతో కలిసి అదే తరహా దోపిడీని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.
ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సుమారు 40 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయని, వారికి ఉపాధి కల్పించేందుకు కనీసం రూ.5,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని కోరారు. కేంద్రం అమలు చేస్తున్న ఆన్‌లైన్ హాజరు, రోజుకు రెండుసార్లు హాజరు నమోదు వంటి నిబంధనలు కార్మికులకు ఇబ్బందికరంగా మారాయని, వాటిని ఉపసంహరించాలని అన్నారు. గ్రామాలను కేవలం కాగితాలపైనే పట్టణాలుగా ప్రకటిస్తున్నారని, తగిన మౌలిక వసతులు కల్పించడం లేదని విమర్శించారు. దీని వల్ల గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ చట్టం వంటి కీలక సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలల విలీనం నూతన విద్యావిధానంలో భాగమే..
రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసే చర్యలు నూతన విద్యా విధానంలో భాగమేనని బి.వెంకట్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైకి కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నట్టు చెబుతూ.. అమలులో మాత్రం అనుసరిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల పని గంటల పెంపు, అసైన్‌మెంట్ భూముల అంశం వంటి నిర్ణయాలు కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు.
రిజర్వేషన్లు, దళితులు, గిరిజనుల హక్కుల అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు. వ్యవసాయ కార్మికులపై ప్రభావం చూపే ‘క్రాప్ హాలిడే’ విధానాన్ని పునఃపరిశీలించి, ఆ రోజుల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహ, జిల్లా అధ్యక్షులు జల్లెల పెంటయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు ఉన్నారు.
‘భూ’సంపద కేంద్రీకరణను అడ్డుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



