‘2023 బ్యాచ్ అధ్యాపకుల’పై దృష్టి సారించండి
ఇంటర్ విద్యా డైరెక్టర్ కు టీజీజెఎల్ 475 అసోసియేషన్ వినతిపత్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలతో పాటు 2023 బ్యాచ్ అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ 475) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు డాక్టర్ వసుకుల శ్రీనివాస్ , డాక్టర్ కుప్పిశెట్టి సురేశ్ తదితరులు శుక్రవారం హైదరాబాద్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ అభిలాష అభినవ్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, మొదటి సంవత్సరం తెలుగు అకాడమీ తెలుగు మీడియం పుస్తకాలను వెంటనే పంపిణీ చేయాలని కోరారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టుల్లో ప్రత్యామ్నాయంగా ఇతరులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అతిథి అధ్యాపక పోస్టులను రెన్యువల్ చేసి, ఖాళీగా ఉన్న వాటిని వెంటనే భర్తీ చేయాలని విన్నవించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు తాగునీటి కోసం ఏర్పాటుచేసిన మంచినీటి శుద్ధి యంత్రాల్లో కొన్ని పని చేయడం లేదని తెలిపారు. వాటిని రిపేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి, విద్యా బోధనకు కృషి చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరలను జీవో నెంబర్ 16 ప్రకారం 2023 మే నెలలో క్రమబద్ధీకరించారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ వీరికి సెకండ్ ఇంక్రిమెంట్ ను ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. వాటి మేరకు వెంటనే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2023 బ్యాచ్ కు చెందిన 3,200 అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి ఇంటర్ విద్యా కార్యాలయంలో ఒక నోడల్ ఆఫీసర్ ను కేటాయించాలని సూచించారు. జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్స్ నుంచి డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వెళ్లడానికి డిగ్రీ కళాశాలల కమిషనర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారనే విషయాన్ని వారు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 2023 బ్యాచ్ అధ్యాపకుల్లో కొంత మందికి నెట్/ స్లెట్టు /పీహెచ్ డీ ఉందని, అదే విధంగా మూడు సంవత్సరాల సర్వీస్ కూడా పూర్తయిందని తెలిపారు. అలాంటి వారికి డిగ్రీ కళాశాలకు వెళ్ళటానికి అవకాశం కల్పించాలనీ, సబార్డినేట్ సర్వీసులు ప్రకారం మూడు సంవత్సరాలు దాటిన వారికి ప్రొఫెషనరీ డిక్లరేషన్ చేయాలన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి వీరికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రమోషన్ మీద వెళ్ళేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ కు, ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్ గా అవకాశం ఇచ్చే విషయంలో 2023 బ్యాచ్ అధ్యాపకలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకోకుండా కొంతమంది జిల్లా అధికారులు సహకరిస్తూ 2025 బ్యాచ్ అధ్యాపకులకు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇటీవల వికారాబాద్ జిల్లాలో అధికారులు సహ కరించి సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశమిచ్చారనే విషయాన్ని డైరెక్టర్ కు తెలిపారు. ఇది నియమాలకు విరుద్ధమని వారు స్పష్టం చేశారు. ఈ అంశా లన్నింటినీ పరిశీలించి 2023 బ్యాచ్ వారికి అవకాశం కల్పించాలని కోరారు.
జూనియర్ కాలేజీల్లోని సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



