Sunday, July 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాలకు రోడ్డు మోక్షం ఎప్పుడో..!

గ్రామాలకు రోడ్డు మోక్షం ఎప్పుడో..!

- Advertisement -

ఏడు గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు.. వర్షాకాలంలో మరింత దుర్భరం..
నవతెలంగాణ-సిర్పూర్ (టి)

ఎన్నికల సమయంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రతి గ్రామానికి రహదారులు, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇస్తుంటారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ హామీలు అమలుకు నోచుకోవడం లేదని సిర్పూర్ (టి) మండలంలోని ఏడు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మండలంలోని చీలపల్లి, లింపుగూడ, రావణపల్లి, మేడిపల్లి, చిన్నమాలిని, మాలిని, పూసుగూడ గ్రామాల ప్రజలు వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి తదితర అవసరాల కోసం నిత్యం ఇదే మార్గం గుండా సిర్పూర్ మండల కేంద్రంతో పాటు కాగజ్‌నగర్, ఇతర పట్టణాలకు వెళ్లి వస్తుంటారు. అయితే సరైన రహదారి లేకపోవడంతో ప్రతి ప్రయాణం ఇబ్బందికరంగా మారుతోంది.

ఈ రహదారి నిర్మాణానికి 2018లో అప్పటి అటవీ, పర్యాటక, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న శంకుస్థాపన చేశారు. సిర్పూర్ నుంచి మెంతదని వరకు 24 కిలోమీటర్ల రహదారిని ప్రతిపాదించి, తొలి దశలో 18 కిలోమీటర్ల పనులకు రూ.18.16 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అనంతరం అటవీ ప్రాంతం గుండా రహదారి వెళ్లాల్సి ఉండటంతో అటవీ శాఖ అనుమతులు లభించక పనులు నిలిచిపోయాయి. తర్వాత ప్రతిపాదనను కుదించి రూ.12.10 కోట్లకు పరిమితం చేసినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రహదారి నిర్మాణానికి అటవీ శాఖ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని, సంబంధిత జీవో కూడా ఉందని ప్రజల సమావేశంలో వెల్లడించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రెండు వాగులు ఉన్నాయి. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో తాత్కాలికంగా నిర్మించిన వంతెనలు కొట్టుకుపోతుంటాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవలు కూడా అందుబాటులోకి రావడం లేదు.

రెండేళ్ల క్రితం వర్షాకాలంలో వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోవడంతో అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి వైద్యం అందక ఆమె మృతి చెందిన ఘటనను గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అలాగే ప్రతి వర్షాకాలంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు బురదలో జారి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ప్రభుత్వం వెంటనే అటవీ శాఖ అనుమతులు తీసుకుని చీలపల్లి–మాలిని రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని, దీంతో చీలపల్లి, లింపుగూడ, రావణపల్లి, మేడిపల్లి, చిన్నమాలిని, మాలిని, పూసుగూడ గ్రామాల ప్రజలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -