ఐదుగురు అరెస్టు
బెంగళూరు: పుట్టిన రోజు వేడుకల పేరుతో మాయమాటలు చెప్పి, ఓ యువతిని ఐదుగురు నిందితులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 30న జరిగిన ఈ ఘటన గురించి బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారణ ఘటన జరిగింది.
పరిచయం కాస్త…
“26 ఏండ్ల బాధితురాలి వివరాల ప్రకారం, ఆమెకు సోమశేఖర్ తో చానాళ్లుగా పరిచయం ఉంది. వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. చాలా సార్లు బయట సాధారణంగా కలుసుకునేవాళ్లు. ఈ క్రమంలో అఘాయిత్య ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు బాధితురాలి పుట్టిన రోజు జరిగింది. ఆ సమయంలో సోమశేఖర్ ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. దీనితో ఇద్దరం కలిసి వేడుక చేసుకుందామని, తలఘట్టపురకు రమ్మని సదరు యువతిని నిందితుడు సోమశేఖర్ ఆహ్వానించాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు, జూన్ 30 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అతను చెప్పిన ఓ హోటల్ సమీపానికి వెళ్లింది. ఆ సమయంలో సోమశేఖర్ తన స్నేహితులను అక్కడికి పిలిపించాడు. పార్టీ తన సొంత ఇంట్లోనే నిర్వహిస్తానని ఆమెకు చెప్పాడు. హోటల్ కు వెళ్దామని ఆమె చెప్పింది. ముందు తన ఇంటికి వెళ్లి, తర్వాత హోటల్ కు వెళ్దామని పట్టుబట్టాడు.
సోమశేఖర్ స్నేహితులు నలుగురు ఆమెను నిందితుని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ వారంతా కొంత సమయం గడిపి భోజనం చేశారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకడైన అంబరీశ్ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం అంబరీశ్ మొదటగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మిగిలిన నలుగురు బయట హాల్లో కూర్చున్నారు. మగతగా ఉండడం వల్ల ఆమె నిందితుడిని వెంటనే గుర్తించలేకపోయింది. కొద్ది సేపటి తర్వాత తనకు స్పృహ రావడంతో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది. తర్వాత పోలీసు అత్యవసర హెల్ప్లైన్ నంబర్ 112కి కాల్ చేసి తనకు జరిగిన ఘోరాన్ని వివరించింది. అప్రమత్తమైన తలఘట్టపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సోమశేఖర్, అంబరీశ్, ప్రదీప్, రామప్ప, జగదీశ్ లను అరెస్టు చేశారు” అని బెంగళూరు నైరుతి విభాగం డీసీపీ అనిత బి.హద్దన్నవర్ వెల్లడించారు.
బర్త్ డే పార్టీ అని పిలిచి..యువతిపై సామూహిక లైంగికదాడి
- Advertisement -
- Advertisement -



