125వ స్థానానికి పడిపోయిన వైనం
టాప్ 10లో యూరప్ ఆధిపత్యం
న్యూఢిల్లీ : గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (జీపీఐ) 2026లో భారత్ దిగజారింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో భారత పాస్‌పోర్ట్ ర్యాంకు 125వ స్థానంలో నిలిచింది. దాదాపు పూర్తిగా వీసా రహిత ప్రవేశంపై దృష్టి సారించే సాంప్రదాయ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లకు భిన్నంగా, గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ రూపొందించిన గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ మరింత సమగ్రమైన సమాచారం ఆధారంగా ర్యాంకులు కేటాయించింది. ఇందులో చలనశీలత, పెట్టుబడి, జీవన నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించి గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో యూరప్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచంలోని టాప్ 10 పాస్‌పోర్ట్‌లలో తొమ్మిది యూరోపియన్ దేశాలకు చెందినవి కావటం విశేషం. ఈ సంవత్సరం సూచికలో 10 అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు.. స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ, డెన్మార్క్ (ఉమ్మడి), నెదర్లాండ్స్ (ఉమ్మడి), ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), నార్వే, సింగపూర్ దేశాల నుంచి ఉన్నాయి. అత్యుత్తమ ప్రదర్శనతో స్వీడన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. చలనశీలతలో ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉన్నప్పటికీ, పెట్టుబడిలో తొమ్మిదవ స్థానంలో, జీవన నాణ్యతలో రెండో స్థానంలో నిలిచి.. అత్యధిక మొత్తం స్కోరును సాధించింది.



