ప్రభుత్వ వైఖరిని సమీక్షించుకోవాలి
కేంద్రానికి సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ లేఖ
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం అంశం రగులుతున్నా.. కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం నోరువిప్పటంలేదు. ప్రతిపక్షాలు ప్రధాని మౌనాన్ని వీడాలని నిలదీస్తున్నాయి. తాజాగా రామ మందిరాన్ని నిర్వహిస్తున్న రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఆర్టీఐ చట్టం ప్రకారం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ‘ప్రజా సంస్థ’ కాదనే తన వైఖరిని పున:పరిశీలించాలని సీపీఐ(ఎం) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హోం మంత్రిత్వ శాఖ తన వైఖరిని సమీక్షించుకోవాలి: జాన్ బ్రిట్టాస్
పారదర్శకత, ప్రజా జవాబుదారీతనం దృష్ట్యా ప్రభుత్వం తన వైఖరిని సమీక్షించుకోవాలని బ్రిట్టాస్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో.. ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన పరిస్థితులు ప్రత్యేకమైనవని బ్రిట్టాస్ పేర్కొన్నారు. నవంబర్ 2019లో సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు తర్వాత, కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ కార్యకలాపాల కోసం ఒక ప్రణాళికను రూపొందించి, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దానిని ఏర్పాటు చేసి, సేకరించిన భూమిని దానికి బదిలీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ట్రస్ట్‌లోని 15 మంది సభ్యులలో 12 మందిని మొదట ప్రభుత్వమే నామినేట్ చేసిందని కూడా గుర్తు చేశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం ట్రస్ట్ ‘పబ్లిక్ అథారిటీ’ కాదని పేర్కొన్న కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జూన్ 6, 2025 నాటి ఉత్తర్వును బ్రిట్టాస్ ఉటంకించారు. కమిషన్ తన నిర్ణయంలో హోం మంత్రిత్వ శాఖ వైఖరిపై ఎక్కువగా ఆధారపడిందని, అందువల్ల పారదర్శకత , ప్రజా జవాబుదా రీతనం దృష్ట్యా హోం మంత్రిత్వ శాఖ తన వైఖరిని సమీక్షిం చుకోవాలని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు నోటిఫికేషన్ జారీ చేసింనందున.. ట్రస్ట్‌ను ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా స్థాపించబడిన సంస్థగా పరిగణిం చలేమనే కేంద్రం వాదనను పున:పరిశీలించాలని వివరిం చారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(హెచ్)(డీ) ప్రభుత్వం స్వతంత్రంగా జారీ చేసిన నోటిఫికేషన్‌కు, న్యాయపరమైన ఆదేశానికి అనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌కు మధ్య ఎలాంటి తేడాను చూపదని జాన్ బ్రిట్టాస్ వివరించారు.
ట్రస్ట్‌లో ప్రభుత్వ ప్రాతినిధ్యం
ట్రస్ట్ పరిపాలనలో ప్రభుత్వం నిరంతరం పాలుపంచుకుంటోందని ప్రతిబింబించేలా.. కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి.. ఐఏఎస్ అధికారులతో సహా, సంస్థాగత ప్రాతినిధ్యాన్ని ట్రస్ట్ పాలనా నిర్మాణం స్థిరంగా కొనసాగిస్తోందని బ్రిట్టాస్ వాదించారు. ఆర్టీఐ చట్టం కింద ట్రస్ట్ పారదర్శకత ప్రమాణాలకు లోబడి ఉండాలా వద్దా అని నిర్ణయించేటప్పుడు ప్రభుత్వ ప్రమేయాన్ని విస్మరించలేమని ఆయన వివరించారు. సంస్థాగత స్వయంప్రతిపత్తి, జవాబుదారీతనం పరస్పర విరుద్ధం కావు ట్రస్ట్‌పై ప్రజలు ఉంచిన అసాధారణ విశ్వాసం సహజంగానే పారదర్శకతపై అంతే బలమైన అంచనాలతో ముడిపడి ఉంటుందని బ్రిట్టాస్ పేర్కొన్నారు. మాతా వైష్ణో దేవి ఆలయ బోర్డు ఉదాహరణను ఉటంకిస్తూ.. సంస్థాగత స్వయంప్రతిపత్తి, జవాబుదారీతనం పరస్పర విరుద్ధం కావని వివరించారు. చట్టబద్ధమైన లేదా ప్రభుత్వ చట్రం కింద స్థాపించబడిన ప్రధాన మత సంస్థలు, పారదర్శక పరిపాలనా, ఆర్థిక వ్యవస్థల కింద పనిచేస్తూనే, మతపరమైన విషయాలలో తమ స్వయంప్రతిపత్తిని కొనసాగిస్తాయని ఆయన పేర్కొన్నారు.
విరాళాలలో అవకతవకల ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పుడు, రామ మందిర్ ట్రస్ట్‌ను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలనే అంశం తలెత్తింది. గతేడాది జూన్ 6న కేంద్ర సమాచార కమిషన్‌లో ఈ ట్రస్ట్‌పై విచారణ జరిగింది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక, దానికి సంబంధించిన ఉత్తర్వును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గోప్యమైనవిగా వర్గీకరించింది. ఆర్టీఐ చట్టం కింద సంబంధిత పత్రాలను అందించకూడదనే నిర్ణయాన్ని కేంద్ర సమాచార కమిషన్.. 2024 నాటి ఉత్తర్వులో సమర్థించింది. వాటిని బహిర్గతం చేయడం వల్ల సంబంధిత వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చని మంత్రిత్వ శాఖ చేసిన వాదనను కమిషన్ అంగీకరించింది. ఈ కేసు నీరజ్ శర్మ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్‌టీఐ) దరఖాస్తుకు సంబంధించినది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి సంతృప్తికరమైన స్పందన రాకపోవడంతో.. శర్మ తన అప్పీల్‌తో కమిషన్‌ను ఆశ్రయించారు. జూన్ 18, 2024న కమిషన్‌లో జరిగిన విచారణ సందర్భంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన స్పందనను తెలియజేసింది. ‘‘ సున్నితత్వం, అన్ని విషయాల దృష్ట్యా, ‘రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం’ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలు మొదలైన వాటి మొత్తం ఆర్కైవ్‌ను గోప్యమైన కేటగిరీలో ఉంచాం” అని బుకాయించింది.



