Tuesday, July 7, 2026
E-PAPER
Homeజాతీయంఅహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు..38 మందికి ఉరిశిక్ష

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు..38 మందికి ఉరిశిక్ష

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ ఘోర ఉగ్రవాద దాడికి పాల్పడిన 38 మంది నిందితులకు కింది కోర్టు (ప్రత్యేక న్యాయస్థానం) విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధర్మాసనం పూర్తిగా సమర్థిస్తూ ఖరారు చేసింది. అలాగే, మరో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు సమర్థించింది. భారత న్యాయ చరిత్రలోనే ఒకే కేసులో ఇంతపెద్ద సంఖ్యలో (38 మందికి) మరణశిక్షలు ఖరారు కావడం ఇదే ప్రథమం.తీర్పుతో పాటు బాధితులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.5 లక్షలు,సాధారణంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది. ఈ నష్టపరిహార ప్రక్రియ మొత్తాన్ని మార్చి 31, 2027 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం గడువు విధించింది.  

జులై 26, 2008న గుజరాత్‌లోని ప్రముఖ వాణిజ్య నగరం అహ్మదాబాద్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కేవలం 70 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులు మాత్రమే కాకుండా, మొదటి విడత పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రమూకలు రెండో విడత బాంబులు పేల్చడం గమనార్హం. ఈ అమానవీయ ఘాతుకంలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 246 మంది తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -