బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవం
నవతెలంగాణ-ఆలేరు టౌన్
మున్సిపల్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంగడి ఆంజనేయులు అన్నారు. ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు సాగర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అశోక్ లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాల గురించి మాట్లాడారు.
బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల వ్యవధిలోనే ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మొదటి వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు ఏర్పాటు చేశామని, బీసీ కాలని, రెడ్డిగూడెంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవతో రేషన్ దుకాణం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గేటు అవతల ప్రాంత ప్రజలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడకుండా అక్కడే పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
పట్టణంలో కోతులు, వీధికుక్కల సమస్యల నివారణకు చర్యలు చేపట్టామని, 6వ వార్డులో కొత్త బోరు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను తగ్గించామని తెలిపారు. స్మశానవాటికలో సీసీ రోడ్లు, బోర్ల మరమ్మతులు చేపట్టి నీటి సమస్యను పరిష్కరిస్తున్నామని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేశామని అన్నారు. కొలనుపాక బ్రిడ్జి అభివృద్ధి సహా ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని, ఆదర్శ మున్సిపాలిటీగా ఆలేరును తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.
కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమేనని, అభివృద్ధి విషయంలో అందరూ ఐక్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. వెంచర్ యజమానుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలను కూడా పూర్తిగా ఖండించారు.ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.



