ఆదివారం నుంచి పోటీలు షురూ
క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎఫ్‌ఐహెచ్ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆడేందుకు మూడు జట్లు ఈ టోర్నమెంట్ నుంచి అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య భారత్ సహా ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, దక్షిణ కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు క్వాలిఫయర్స్‌లో పోటీపడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రెండు ఆస్ట్రో టర్ఫ్‌లు సహా రాజీలేకుండా మౌలిక సదుపాయాల కల్పన, వసతి ఏర్పాట్లు చేస్తున్నట్టు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హాకీ క్వాలిఫయర్స్ టోర్నమెంట్ నిర్వహణపై క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీబాలా దేవితో కలిసి మంత్రి గురువారం ఎల్బీ స్టేడియంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఈ నెల 8న ఆరంభం కానుండగా.. 14న ముగియనుంది. ఎనిమిది జట్లలో మూడు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించనున్నాయి. ‘హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో జాతీయ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావాలని పట్టుదలగా పని చేస్తున్నాం. అంతర్జాతీయ హాకీ సమాఖ్య, హకీ ఇండియాలతో సమన్వయం చేసుకుంటూ టోర్నీలో పోటీపడుతున్న జట్లకు ఉత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో రాష్ట్రాన్ని క్రీడలకు అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. భారత్ సహా ఏడు విదేశీ జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలోని ఆస్ట్రో టర్ఫ్‌లపై సాధన మొదలెట్టాయి. టోర్నమెంట్ ఆరంభ, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని’ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.



