Thursday, July 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమార్కెట్లకు ట్రంపోన్మాద భయాలు

మార్కెట్లకు ట్రంపోన్మాద భయాలు

- Advertisement -

రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్‌ 1,677 పాయింట్ల పతనం

‌ముంబయి : ట్రంప్‌ ‌యుద్ధోన్మాదం దలాల్‌ ‌స్ర్టీట్‌‌ను బెంబేలెత్తించింది. అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో మళ్లీ చెలరేగిన భౌగోళిక ఉద్రిక్తతలు బుధవారం స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి. యుఎస్‌-ఇరాన్ మధ్య తాజా సైనిక పరిణామాలు, ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు పెరగడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సెన్సెక్స్ 1,677.12 పాయింట్లు లేదా 2.15 శాతం క్షీణించి 76,504కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 516.65 పాయింట్లు లేదా 2.12 శాతం పడిపోయి 23,882 వద్ద ముగిసింది. మార్కెట్ పతనంతో పెట్టుబడిదారుల సంపద ఒక్క రోజులోనే రూ.8.13 లక్షల కోట్లు హరించుకుపోయింది. బిఎస్‌ఇలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ గత సెషన్‌లోని రూ.479.68 లక్షల కోట్ల నుంచి రూ.471.55 లక్షల కోట్లకు పడిపోయింది.

అన్ని రంగాలపై ప్రభావం
మార్కెట్ పతనం కేవలం ప్రధాన సూచీలకే పరిమితం కాకుండా దాదాపు అన్ని రంగాలపై పడింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 2.51 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 2.45 శాతం క్షీణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్-100 తుదకు1.55 శాతం, స్మాల్‌క్యాప్-100 సూచీ 2.24 శాతం చొప్పున పడిపోయాయి. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ 26 శాతం ఎగసి 14.68కు చేరడం పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన చోటు చేసుకుంది.

అన్ని షేర్లూ పతనం..
సెక్టోరల్ సూచీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకులు, ఎఫ్‌ఎంసిజి, కెమికల్స్, సిమెంట్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. ఫార్మా, హెల్త్‌కేర్ వంటి రక్షణాత్మక రంగాలు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌లో ఇండిగో షేరు 5.02 శాతం పతనంతో అత్యధిక నష్టాన్ని చవిచూసింది. మారుతీ సుజుకి, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటిసి, బిఇఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా 2 నుంచి 4 శాతం వరకు క్షీణించాయి. సెన్సెక్స్‌-30‌లోని అన్ని సూచీలు నేల చూపులు చూశాయి.

ఉద్రిక్తతలే ప్రధాన కారణం..
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు, కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలపై నెలకొన్న అనిశ్చితి కలిసి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు, మధ్యప్రాచ్య పరిస్థితులు భారతీయ మార్కెట్ల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయని వారు విశ్లేషించారు. చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కఠినంగా కొనసాగించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -