Thursday, July 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినాటోలో కుమ్ములాట-రాజీ!

నాటోలో కుమ్ములాట-రాజీ!

- Advertisement -

టర్కీలో జరిగిన 32దేశాలతో కూడిన ఉత్తర అట్లాంటిక్ సంధి సంస్థ(నాటో) రెండు రోజుల సమావేశాలు సఫలమా? విఫలమా అంటే దెబ్బలాట-ముద్దులాటగా ముగిసిందని చెప్పవచ్చు. నాటో బడ్జెట్, ఉక్రెయిన్‌కు సాయం పెంచటం ప్రధాన అజెండాగా రాజధాని అంకారాలో సమావేశమైంది. వచ్చే సమావేశాన్ని అల్బేనియాలో నిర్వహించాలన్న ప్రతిపాదన మీద ఏకాభిప్రాయం లేకపోవటంతో తేదీలతో సహా దేన్నీ ఖరారు చేయకుండా ఎవరిపాటుకు వారు వెళ్లిపోయారు. నాటో చరిత్రలో ఇది ఒక పెద్ద వైఫల్యం, ఇది కూడా మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు వైరుధ్యం కాదు. వచ్చే ఏడాది సమావేశం లేదంటే ఆచరణలో రెండేండ్ల వ్యవధి ఉంటుంది. అప్పటికి ట్రంప్ పదవీ కాలం కూడా పూర్తవుతుంది గనుక అప్పుడు చూసుకుందాంలెమ్మనే ఆలోచన దాని వెనుక ఉంది. నాటో అమెరికా సామ్రాజ్యవాదులు ఏర్పాటు చేసిన ఒక కీలకమైన మిలిటరీ కూటమి. అదిరించి బెదిరించి తన పబ్బం గడుపుకోవటానికి వాషింగ్టన్ చూస్తున్నది. రష్యాను చూసి భయపడుతున్న ఐరోపా దేశాలు కూడా అమెరికాతో తెగేదాకా లాగకుండా చూసుకుంటు న్నాయి.

అదే సమయంలో అమెరికా పెత్తనం చెల్లదని, దానికి తాన తందాన అనేది లేదని తొలిసారిగా స్పష్టం చేశాయి. ఇరాన్‌పై తమ దాడులకు నాటో దేశాలు మద్దతుగా రాలేదన్న ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ అంకారా రావటానికి కారణం, ఆ దేశనేత ఎర్డోగన్‌తో ఉన్న సంబంధాలే తప్ప మరొకటి కాదన్నాడు. ఆ వెంటనే మరోసారి నాటోపై విరుచుకుపడ్డాడు. ఈ తీరు తెన్నులు చూసిన తరువాత అమెరికా ఆగ్రహం తగ్గాలంటే వచ్చే సమావేశాన్ని వాయిదా వేస్తే మంచిదని కొన్ని దేశాలు భావించటంతో ఎలాంటి నిర్ణయం లేకుండా సమావేశం ముగిసింది. ‘ఆ ఊరికి ఈ ఊరు ఎంతదూరమో ఈ ఊరికి ఆ ఊరూ అంతే దూరం’ అన్నట్లుగా అమెరికా బింకాలు పోవటం తప్ప ఐరోపాను వదులుకొనేందుకు అది కూడా సిద్ధం కాదు. దాని ఆయుధాల విక్రయానికి నాటో పెద్ద మార్కెట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో తమ చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని వాషింగ్టన్ చూస్తోంది. ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా పశ్చిమాసియా సంక్షోభంలో చిక్కుకున్న అమెరికా-ట్రంప్ ఎలా బయటపడతాడో చూద్దా మన్నట్లు ఐరోపా ధనిక దేశాలు ఉన్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడన్నట్లుగా టర్కీ నేత ఎర్డోగన్‌‌ను ట్రంప్ ఆకాశానికి ఎత్తాడంటే కాసుల వర్షం కనిపించటమే కారణం. తొలిసారి పాలనా కాలంలో ట్రంప్-ఎర్డోగన్ సంబంధాలు సజావుగా లేవు.

అమెరికాను ధిక్కరించి రష్యా నుంచి మనదేశం మాదిరే ఎస్-400 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఇప్పుడు వాషింగ్టన్ నుంచి ఎఫ్-35 విమానాల కొనుగోలుకు సిద్ధపడటమే ట్రంప్ పొగడ్తల మర్మం. అయితే టర్కీకి వాటిని విక్రయిస్తే మధ్య ప్రాచ్యంలో బలాబలాల్లో వచ్చే మార్పు తనకు నష్టదాయకమని ఇజ్రాయిల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది చివరికి లక్ష్యంగా నిర్దేశించిన ‌జీడీపీలో మిలటరీ ఖర్చు 3.5శాతాన్ని ఖర్చు చేస్తామని , రానున్న రోజుల్లో సభ్యదేశాలు ఐదుశాతం ఖర్చు చేయాలని సంకల్పం చెప్పుకున్నాయి. గతంలో అమెరికా నిర్దేశించిన రెండు శాతం నుంచి ఈ పెరుగుదలను చూస్తే రక్షణ పేరుతో యుద్ధోన్మాదంతో ముందుకు పోతున్నాయన్నది స్పష్టం. ఇది ఆయా సభ్యదేశాలకు ముప్పు తద్వారా అది యావత్ ప్రపంచానికి వస్తుందని వేరే చెప్పనవసరం లేదు. తాను అధికారానికి వస్తే 24 గంటల్లో ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పిన ట్రంప్ ఏడాదిన్నర కావస్తున్న సమయంలో ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇచ్చి పోరును ఎగదోసేందుకు నాటో దేశాలతో కలసి ప్రయత్నించటం అంకారా సమావేశాల్లో యావత్ ప్రపంచం గమనించింది. సభ్య దేశాలు మిలిటరీ ఖర్చును పెంచుతున్నాయంటూ నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూటే శ్వేతభవన అధిపతి ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు చూశాడు.

దీంతో ట్రంప్ కూడా సమావేశం విజయవంతంగా ముగిసిందని స్పందించాడు. తమ ఖరీదైన పేట్రియాట్ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందచేస్తామని, అక్కడే ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇస్తామని కూడా ట్రంప్ చెప్పాడు. అమెరికాతో కలసి ఇరాన్‌పై పోరుకు వ్యతిరేకత తెలపటం ఐరోపా దేశాలు తీసుకున్న వైఖరి సరైనదే, అంకారాలో కూడా అదే వైఖరికి కట్టుబడి ఉండటం అమెరికాకు మరో ఎదురుదెబ్బ. సూటిగా చెప్పాలంటే ఇరాన్‌లో వాటికి ఎలాంటి లాభం ఉండదు. అవి కూడా ఆయుధాలను అమ్ముకోవటం ద్వారా ఉక్రెయిన్‌లో కాసుల పంట పండించుకోవచ్చు, కాంట్రాక్టులూ దక్కించుకోవచ్చు. అంకారా సమావేశాలను వేదికగా చేసుకొని ఇరాన్‌తో కుదిరిన అవగాహనా ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించాడు. ఇదే సమయంలో డెన్మార్క్ స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్‌లాండ్ తమకు కావాల్సిందేనని, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తమచేతికి వచ్చిన దాన్ని వదులుకొని తెలివి తక్కువగా వ్యవహరించామని ట్రంప్ చెప్పటం అమెరికా విస్తరణ కాంక్షతోనే ఉందన్నది స్పష్టం. రష్యా, చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తున్నందున ట్రంప్ చెబుతున్నదానిలో వాస్తవం కూడా ఉందని నాటో అధిపతి రూటె చెప్పటం లొంగుబాటుకు నిదర్శనం. ఏదో ఒకసాకుతో అమెరికా ఆక్రమించుకుంటే సమర్ధించినా ఆశ్చర్యం లేదు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -