శిబానీ ధవళికర్… పదేండ్ల పాటు సాప్ట్‌వేర్‌గా ఉద్యోగం చేసింది. కానీ కళ పట్ల ఆసక్తి ఆమెను వెంటాడుతూనే ఉంది. జీతం బాగానే ఉన్నా ఆ పనిలో ఆమెకు సృజనాత్మకత కనిపించలేదు. అందుకే హాబీగా మొదలెట్టిన చిత్రకళను సోషల్ మీడియాతో పంచుకుంది. అదే తర్వాత కాలంలో ఆమెను ఓ వ్యాపారవేత్తగా మార్చింది. సాంప్రదాయ చేతికళను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు ఏకంగా సెరామిక్ స్టూడియోనే నిర్మించింది. చేతితో చిత్రించిన టైల్స్‌తో పూణే నుండి చిలీ వరకు విస్తరించిన ఆమె ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందాం…
ఎనిమిదేండ్ల కిందట శిబాని జీవితం చాలా భిన్నంగా ఉండేది. చదువు పూర్తి చేసిన తర్వాత టెక్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ పనంతా సాంకేతికతపై ఆధారపడి, డెస్క్‌కే పరిమితమైపోయింది. సృజనాత్మకతకు దూరమయ్యాననే భావన ఆమెకు కలిగింది. చిన్నప్పుడు నిరంతరం రంగులు వేస్తూ, గీతలు గీస్తూ, చేతితో వస్తువులు తయారు చేసేది. కానీ ఈ సృజనాత్మకత జీవనోపాధిగా మారుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మొదట్లో పూల చిత్రాలు, రంగురంగుల దృశ్యాలు, తనకు ఆనందాన్నిచ్చే నమూనాలను ఎక్కువగా గీసేది. అదే సమయంలో కళాకారులు తమ పనిని ఇతరులతో పంచుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలయ్యాయి. శిబానీ కూడా తన చిత్రాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.
అంతా మార్చేసిన ఫ్లీ మార్కెట్ స్టాల్
‘చాలామంది రంగులకు, చేతితో చేసిన పనికి స్పందించారు. సృజనాత్మకత ఇంతకంటే గొప్పదిగా మారగలదా అని నేను ఆలోచించడం అదే మొదటిసారి’ అంటూ ఆమె ఆశ్చర్య పోయింది. మొదట్లో ఆమె చెక్క ఫొటో ఫ్రేములు, నేమ్‌ప్లేట్లకు రంగులు వేసింది. ఉద్యోగం చేస్తూనే బెంగళూరులోని ఒక ఫ్లీ మార్కెట్‌లో సరదాగా తన పేరు నమోదు చేసుకుంది. ‘నేను దాదాపు వంద ఫ్రేములు తయారు చేసి అక్కడకు వెళ్లా. ఫ్లీ మార్కెట్లకు వెళ్తూ ఈ పనినే కొనసాగిస్తే ఎలా ఉంటుందని ఆలోచించా’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. అక్కడ వచ్చిన స్పందనకు ఆశ్చర్యపోయింది. ఫ్రేములన్నీ అమ్ముడయ్యాయి, ఫ్లీ మార్కెట్‌కు రాలేకపోయిన వారు ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించారు. చిన్న చిన్న ఆర్డర్లు నెమ్మదిగా మొదలయ్యాయి. కొన్ని రోజులకు ఉద్యోగాన్ని వదిలేసి కళకే అంకితమయ్యేందుకు పూణేకు వచ్చేసింది.
ఒక విఫల ప్రయోగం
మొదట్లో పెయింటింగ్‌లు, డిజిటల్ ఆర్ట్, చేతితో తయారు చేసిన అలంకరణ వస్తువులు తయారు చేసేది. ఇటువంటి సమయంలో ఆమెకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఒక క్లయింట్ చేతితో రంగులు వేసిన వాల్ ప్లేట్లను ఆర్డర్ చేశారు. శిబానీ స్థానిక మార్కెట్ నుండి సిరామిక్ ప్లేట్లను కొని యాక్రిలిక్ రంగులతో వాటిపై చిత్రించింది. కానీ ఆ రంగు వెంటనే ఊడిపోయింది. ‘ఆ వైఫల్యం నాలో మరింత పట్టుదలను పెంచింది. సిరామిక్ వస్తువులపై రంగు ఎందుకు నిలవదు, సాంప్రదాయ సిరామిక్ కళ ఏండ్ల తరబడి ఎలా నిలిచి ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాను’ అని ఆమె అన్నారు. సమాధానాల అన్వేషణ ఆమెను జైపూర్‌కు తీసుకువెళ్ళింది. అక్కడ ఆమె శతాబ్దాల నాటి నీలిరంగు కుండల తయారీలో పూర్తిగా లీనమైంది. పది రోజుల పాటు అక్కడ చాలా నేర్చుకుంది.
ఓ స్పష్టత కూడా ఇచ్చింది
‘నేను చిత్రాలు గీయడానికే ఉద్యోగాన్ని వదిలేశాను, కుండలు తయారు చేయడానికి కాదు’ అని ఆమె గుర్తుచేసుకుంది. తన కళను సిరామిక్‌పైకి తీసుకురావడానికి ఒక మార్గాన్ని కనుగొనాలనుకుంది. ముంబైలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ ద్వారా అనేక పరిశోధనలు చేసింది. దీనికోసం అవిశ్రాంత ప్రయోగాలు చేసింది. ఈ పద్ధతి ఆమెకు సిరామిక్ ఉపరితలాలపై మన్నికైన, ఉతకగలిగే విధంగా చిత్రించడానికి వీలు కల్పించింది. టేబుల్‌వేర్, సిరామిక్ నేమ్‌ప్లేట్‌లతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. వాటికి లభించిన ప్రజాదరణ ఒక కొత్త ఆలోచనకు దారితీసింది. చేతితో చిత్రించిన వంటగది టైల్స్ ద్వారా తన కళను ప్రపంచానికి పరిచయం చేసింది.
కోవిడ్ మార్చివేసింది
తన ప్రయాణం మొదలుపెట్టిన మూడేండ్లకు కోవిడ్ వచ్చింది. అప్పటికి శిబానీ ఇంకా ఒక చిన్న సంస్థతోనే వ్యాపారాన్ని నడుపుతోంది. వ్యాపారం ఏమౌతుందోనని భయపడింది. కానీ ఊహించనిది జరిగింది. ప్రజలు తమ ప్రియమైనవారికి భౌతికంగా దూరంగా ఉండటంతో చేతితో తయారు చేసిన వస్తువులపై ఆసక్తి పెంచుకున్నారు. ‘వ్యాపారం జోరుగా సాగలేదు కానీ నేను ఊహించని విధంగా స్థిరంగా ఉంది’ అంటూ ఆ రోజులను గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ఒక ఇన్‌స్టాగ్రామ్ సందేశం ఆమె వ్యాపార గమనాన్ని మార్చేసింది. సూరత్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ ఆమె గురించి ఆన్‌లైన్‌లో చూసి ‘సిరామిక్ వస్తువులు వంటగది టైల్స్‌గా పనికొస్తాయా’ అడిగారు. అదే శిబానీ మొదటి భారీ ఇన్‌స్టాలేషన్ ప్రాజెక్ట్‌కు దారితీసింది. 1,000 వరకు చేతితో చిత్రించిన టైల్స్ సిద్ధం చేసింది. ఈ రోజు ఆమె స్టూడియో ప్రత్యేకమైన సిరామిక్ టైల్స్‌ను రూపొందించడానికి ఇంటీరియర్ డిజైనర్లతో కలిసి పనిచేస్తుంది. ప్రతి ప్రాజెక్ట్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడి, చేతితో పెయింట్ చేయబడుతుంది. కళాకృతి, దాని పరిమాణాన్ని బట్టి ధర మారుతుంది. నటి సోనమ్ కపూర్ కిచెన్ కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 6,000 టైల్స్ ఉపయోగించారని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిసింది.
పూణే నుండి చిలీ వరకు
ఇటీవల శిబానీ బృందం చిలీలోని ఒక చిన్న పట్టణంలో ఇల్లు కట్టుకుంటున్న ఒక కుటుంబం కోసం కస్టమ్ టైల్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. నిర్మాణ సమయంలో అంతరించి పోతున్న స్థానిక వృక్ష, జంతుజాలాలకు గౌరవంగా ఈ కళాకృతిని రూపొందించాలని ఆ కుటుంబం కోరుకుంది. శిబానీ బృందం వారాల తరబడి అధ్యయనం చేసింది. చుట్టుపక్కల కనిపించే స్థానిక మొక్కలు, పండ్లు, పక్షులు, జంతువుల వివరాలను తెలుసుకుంది. జీవావరణ వ్యవస్థలను ఆ బృందం చేతితో చిత్రించిన సిరామిక్ నమూనాలుగా మార్చింది. పూర్తయిన ఆ టైల్స్ చివరికి పూణే నుండి చిలీ వరకు ప్రయాణించాయి. ‘చిలీలోని ఓ కుటుంబం కోసం పని చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది కేవలం ఇన్‌స్టాగ్రామ్ శక్తి’ అంటుంది ఆమె.
వృద్ధికి అతిపెద్ద చోదక శక్తి
‘నేను ఎప్పుడూ నా వ్యాపార ప్రకటన కోసం డబ్బు ఖర్చుపెట్టలేదు. కేవలం నిజాయితీనే నన్ను నినబెట్టింది’ అని ఆమె అన్నారు. వస్తువులలోని సహజత్వం, దాని వెనకున్న శ్రమ, ఓర్పు, నైపుణ్యం కూడా ఆమెకు సహాయపడ్డాయి. ‘చేతి వృత్తుల కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రజలు సంకోచిస్తారు, ఎందుకంటే వాటి వెనుక ఉన్న శ్రమను వారు ఎప్పుడూ చూడలేరు. కానీ వారు ఆ ప్రక్రియను చూసినప్పుడు, దాని విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు’ అని ఆమె వివరించారు. ఈ రోజు శిబానీ స్టూడియో ఎనిమిది మంది సభ్యుల బృందంగా ఎదిగింది. గత ఏడాదిలోనే ఆమె చిత్రించిన టైల్స్ దాదాపు 100 వంటగదులలో చోటు సంపాదించుకున్నాయి. కానీ ఆమెకు ఈ ప్రయాణంలో అత్యంత అర్థవంతమైన భాగం దాని పరిమాణం కాదు. ఒకప్పుడు ‘కేవలం ఒక హాబీ’ అని కొట్టిపారేసింది నెమ్మదిగా నిలకడైన సృజనాత్మక జీవనోపాధిగా మారడమే.
సలీమా



