బిల్లులు చెల్లించకపోతే కోర్టుకు రండి : ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైకోర్టులో శుక్రవారం వేర్వేరు కేసులపై విచారణ జరిగింది. విద్యుత్తు సబ్‌స్టేషన్ కోసం ఉచితంగా ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేయాలన్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మిషన్ భగీరథ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు చెందిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఉచితంగా ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేయాలని కోరుతూ శ్రీ అభిషేక్ స్టీల్స్ అండ్ పవర్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని ఫ్యాక్టరీ స్థలంలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను తొలగించి భూమిని అప్పగించేలా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఆదేశాలు ఇవ్వాలని కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు. గుండ్లపోచంపల్లిలో ప్రత్యేక ఫీడర్ ద్వారా విద్యుత్తు సరఫరా చేస్తామని అప్పటి ఏపీఎస్‌ఈబీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కంపెనీకి చెందిన నాలుగు ఎకరాల భూమిలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. అయితే ఆ హామీ అమలు కాలేదన్నారు. అనంతరం కంపెనీ రుణాలు చెల్లించలేకపోవడంతో ఫ్యాక్టరీ మూతపడిం దనీ, ఆస్తులను బ్యాంకులు వేలం వేసినట్టు వివరించారు. గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకున్నామనీ, భూమిని తిరిగి స్వాధీనం చేయడంతో పాటు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న న్యాయ మూర్తి.. భూమి హక్కులు లేదా పరిహారానికి సంబంధించిన వివాదాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవాలన్నారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. విద్యుత్తు బకాయిలు, సర్‌చార్జీల రూపంలో రూ.1.28 కోట్లు చెల్లించకపోతే శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్‌కు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ కంపెనీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి కొట్టివేశారు. కొత్త విద్యుత్ కనెన్షన్ తీసుకున్నామని చెప్పి పాత బకాయిలు చెల్లించమంటే కుదరదని తీర్పులో పేర్కొన్నారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిపై ఆగ్రహం
మరో కేసులో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజక వర్గాలకు మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా కోసం ఎన్‌సీసీ సంస్థ చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.180.17 కోట్ల బిల్లుల్లో ఆమోదించిన మొత్తాన్ని చెల్లించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయక పోవడంతో సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. బిల్లులను ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించినప్పటికీ అమలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా పిటిషన్ దాఖలు చేశామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనిపై న్యాయ మూర్తి.. ఈనెల 13లోగా గత ఉత్తర్వులను అమలు చేసి నివేదిక సమర్పించాలనీ, లేదంటే సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సిందేనని తేల్చి చెప్పారు.
బిల్లులు చెల్లించకపోతే కోర్టుకు రండి
చేప పిల్లలను సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లిం చాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన మరో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి విచారించారు. 2023-24 ఏడాదికి చెందిన చేప పిల్లలు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించాలన్న గత ఆదేశాల్ని అధికారులు కావాలని అమలు చేయడం లేదని పిటిషనర్ లాయర్ చెప్పారు. గవర్నమెంట్ ఎంప్లాయిస్ జీతాల కోసం ఆ నిధుల్ని వినియోగించామని ప్రభుత్వ ప్లీడర్ చెప్పడంపై న్యాయమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈనెల 10లోగా బిల్లులు చెల్లించకపోతే సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు
ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంకటాపురానికి చెందిన వితంతువు తిప్పల సాయిభవాని హైకోర్టుకు లేఖ రాస్తూ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ముడుపులు తీసుకుంటున్నారని పేర్కొ న్నారు. ఈ లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన జస్టిస్ పి.శ్యాం కోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్‌తో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.
భూమి స్వాధీనం పిటిషన్ తిరస్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



