కేరళ మాజీ ముఖ్యమంత్రి
పినరయి విజయన్ విమర్శ
వరద ప్రభావిత బాధితులకు పరామర్శ
తిరువనంతపురం : కేరళం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతృత్వ యూడీఎఫ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. వయనాడ్ లోని కల్లాడి గ్రామాన్ని మట్టి చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆయన గురువారం నాడు సందర్శించారు. మీనాక్షి నది సమీప ప్రాంతాలలో కూడా ఆయన పర్యటించారు. వరద ప్రభావితానికి గురై సహాయ శిబిరంలో తలదాచుకున్న బాధితులను ఆయన పరామర్శించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజల ను, కార్మికులను, తేయాకు ఎస్టేట్ నివాసి తులతోనూ ఆయన మాట్లాడి ఇబ్బందు లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ … ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని, మీనాక్షి వంతెన సమీపంలో నివాసితుల పునరావాసం కేవలం వాగ్దానం మాత్రమేనని ఆయన అన్నారు. భూమి కోత, మట్టి చరియలు విరిగిపడటాన్ని నివారించడంలో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. సహాయ శిబిరంలో బాధిత ప్రజలకు ప్రాథమిక సదుపాయలను కూడా కల్పించడం లేదని, కనీసం నిత్యావసరాలు కూడా అందజే యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ మాస్టరు, ఎమ్మెల్యే ఎంవి జయరాజన్, సిపిఎం వయనాడ్ జిల్లా కార్యదర్శి కె రఫీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు సికె శశీంద్రన్ పాల్గొన్నారు.
ఏడుగురికి చేరిన మృతుల సంఖ్య
కాగా, మీనాక్షి వంతెన సమీపంలోని మెప్పడి-అనక్కంపైల్ టన్నెల్ ప్రాజెక్టులో ఈ నెల 7న కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణించినవారి సంఖ్య ఏడుకు చేరింది. మరొకరి ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. సహాయక సిబ్బంది గురువారం నాడు మట్టి చరియలను కింద చిక్కుకు పోయిన నలుగురిని వెలికితీయగా.. వారంతా అప్పటికే చనిపోయివున్నారు. కాగా ఈ ఘటనలో గాయపడిన ఏడుగురి కార్మికులకు స్థానిక ఆస్ప త్రిలో చికిత్స అందిస్తున్నారు.


