నవతెలంగాణ – ఉప్పునుంతల
విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో గురువారం ఉప్పునుంతల మండలంలో విద్యాసంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు చింతల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే కొనసాగించాలని అన్నారు.
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు, విద్యుత్, ఇంటర్నెట్, తాగునీరు, వంట షెడ్లు, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు, దుప్పట్లు అందించాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలను ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచాలని కోరారు.
విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని, విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు, రవాణా సౌకర్యం అందించాలని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లు, సరిపడా పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్, చింటూ, గణేష్, కిరణ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.



