- ఆహార భద్రతపై మళ్లీ ప్రశ్నలు
- -ఫిర్యాదు చేసిన వినియోగదారునికే నిర్లక్ష్య సమాధానం?
- -ఏడాదిగా ఖాళీగా సానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు..తనిఖీల లేమిపై విమర్శలు
- -హైదరాబాద్‌లోనే పట్టించుకోరు.. ఇక్కడ ఏమవుతుంది?
- నవతెలంగాణ-రాయికల్: రాయికల్ పట్టణంలో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పట్టణంలోని లావణ్య చికెన్ సెంటర్‌లో కొనుగోలు చేసిన తలకాయ కూరలో ఈగ కనిపించిందంటూ ఓ వినియోగదారుడు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.ఆహార పదార్థాల్లో పరిశుభ్రత,నాణ్యతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
- బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం లావణ్య చికెన్ సెంటర్‌లో తలకాయ కూర కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు.భోజనం చేసే సమయంలో కూరలో ఈగ కనిపించడంతో సహచరులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.వెంటనే సంబంధిత దుకాణం నిర్వాహకుల దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఈ ఘటనపై స్పందన తెలుసుకునేందుకు నవతెలంగాణ ప్రతినిధి చరవాణి ద్వారా సంబంధిత దుకాణం యజమానిని సంప్రదించగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు స్పందించినట్లు తెలిసింది. “హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులు వస్తుంటాయి.అక్కడే అధికారులు పెద్దగా పట్టించుకోరు.ఇక్కడ ఏమి చేస్తారు? మీకు నచ్చకపోతే ఇంకోసారి మా దుకాణానికి రావద్దు”అని సమాధానం ఇచ్చినట్లు వినియోగదారుడు ఆరోపించాడు.ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చకు దారితీశాయి.
ఇదిలా ఉండగా,గత సంవత్సరకాలంగా రాయికల్ పట్టణంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటం కూడా ఆహార భద్రత అంశంపై ఆందోళనలకు కారణమవుతోంది.బేకరీలు,హోటళ్లు, చికెన్ సెంటర్లు,ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు,సూపర్ మార్కెట్ లు, మహా మార్ట్ ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో కొందరు వ్యాపారులు నిబంధనలను పట్టించుకోకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయం,అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ, నాణ్యత లేని పదార్థాల వినియోగం వంటి అంశాలపై పలు వార్తా కథనాలు వెలువడినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించలేదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార వ్యాపారాలపై పర్యవేక్షణ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఆహార భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని,పట్టణంలోని ఆహార విక్రయ కేంద్రాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.అలాగే ఖాళీగా ఉన్న సానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టును తక్షణమే భర్తీ చేసి ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.



