– ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలి
– ఏజెన్సీ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి
– వైద్యులను, సిబ్బందిని నియమించాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించింది. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కొక్కెరపాటి పుల్లయ్య తో కలిసి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మౌనిక తో సమావేశమైన నాయకులు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర విభాగం, తల్లి – శిశు విభాగం, డయాలసిస్ కేంద్రం, పురుషులు, మహిళల వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులు, క్షతగాత్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ గ్రామాల్లో క్రమం తప్పకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఖాళీగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సౌకర్యాల కొరత, వైద్యులు, సిబ్బంది లోటుపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు.
జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నే వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ వైద్యుల ను నియమించాలని,డైలాసిస్ కేంద్రం లో కాంట్రాక్టు విధానం రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు బీ. చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, అశ్వారావుపేట మున్సిపాలిటీ క్రిస్టియన్ మైనారిటీ కో-ఆప్షన్ కౌన్సిలర్ తగరం నిర్మల, మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు, కుంజ మురళి తదితరులు పాల్గొన్నారు.



