Monday, July 13, 2026
E-PAPER
Homeదర్వాజకాలం ఖాళీ చేసిన చోటు

కాలం ఖాళీ చేసిన చోటు

- Advertisement -


ఒక శతాబ్దపు శ్వాసను మోసిన
ఆ కూరగాయల మార్కెట్…
ఒక ఊరి జ్ఞాపకాలకు కట్టిన పచ్చని గుమ్మం
శివాలయ ఘంటికల ప్రతిధ్వనిలో
కొత్తిమీర.. పూదీన సువాసనల ప్రార్థనలు
ఆలయాన్ని ఆనుకొని ఉన్న
పూల దుకాణాల గుప్పుమనే పరిమళాలు
మెయిన్ రోడ్డంతా…
మనుషుల అడుగులతో కొట్టుకునే గుండె చప్పుళ్ళు
తాజా కూరగాయల అడ్డా బొగ్గుట్ట
మార్కెట్ అంటే ఆషామాషీ కాదు
అన్ని కులాల మతాల సమ్మిళితం
జానీభాయ్.. ఆంథోనీ.. కొత్తిమీర శ్రీను అబ్బో
అందరూ… ఓ ఆత్మీయ బలగం
నాన్న వేలిని పట్టుకున్న నా బాల్యం
అక్కడి ప్రతి దుకాణానికీ పరిచయమే….
అక్కడే ప్రపంచాన్ని ముందుగా చదివింది
బుట్టల మీద పేర్చిన కూరగాయలు కాదు
ఋతువుల రంగుల ప్రదర్శన
అమ్మకందారుల పిలుపులు
ఇంటి బంధువుల ఆప్యాయ పలకరింపులు
తూకం రాళ్లలో వ్యాపారం కంటే
విశ్వాసమే ఎక్కువ బరువు
చిల్లర నాణేల చప్పుళ్లలో
జీవితాల సంగీతం విన్న అనుభూతి ఇంకా పోలేదు
ఆ వీధి దుమ్ములో..తడిలో..చిత్తడిలో…
ఎన్నో తరాల అడుగుల సంతకాల నిధి
ఇటు నుంచి ఆమ్ బజారుకు సీదా తొవ్వ
ఇరుకుగా ఉన్నా ..అన్నీ అందిపుచ్చినట్టుండేవి
ఇప్పుడు…
ఆ సందడి స్థానంలో నిశ్శబ్దం ఓ బాధా దృశ్యం
ఖాళీ అయ్యింది స్థలం మాత్రమే కాదు
లోపల ఖాళీ అయిన కాలమూ….
మార్కెట్ తరలింది…కానీ..
జ్ఞాపకాలు వెళ్లడానికి దారి కనబడలేదు
కూరగాయలు కొత్త చోటికి చేరాయి
మా బాల్యం మాత్రం పాత బల్లల దగ్గరే కూర్చుంది
కొన్ని ప్రదేశాలు కూలిపోవు…
వాటి చుట్టూ తిరిగిన మన కాలమే కూలిపోతుంది.
ఇప్పుడు
మార్కెట్ శివాలయం మళ్ళీ తన
ఉపమానం మార్చుకోవాలేమో…
రూపు రేఖలు మారుతున్నాయి
ఊరు మొఖం సర్జరీ చేసుకుంటుంది
పాత ప్రదేశాల వెచ్చదనం
ఒక ఊరి ఆలింగనం…అన్నీ కాలపు సంచిలో
దాచుకున్న పచ్చని కూరగాయల్లా..
ఇంకా ఏదో తడి స్పర్శ మనసుకు తాకుతోంది
ఏవో అనుబంధపు పోగులు ముడేస్తున్నాయి
నిజంగానే…
కొన్ని చోట్లకు ఎప్పటికీ మళ్లీ వెళ్లలేం…
కొన్ని ప్రదేశాలు భూమి మీద ఉండవు…
మనసులోనే చిరునామా మార్చుకోకుండా
శాశ్వతంగా నివసిస్తాయి…కదూ…
(తరలిపోయిన ఇల్లందు కూరగాయల మార్కెట్ ను
గుర్తు చేసుకుంటూ…)
డా.కటుకోఝ్వల రమేష్, 9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -