పురుగుల మందు తాగి ఆత్మహత్య
సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో
కొత్తూరు మండలంలో ఘటన
వివరాలు వెల్లడించిన ఫ్యూచర్ సిటీ
కమిషనర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-కొత్తూరు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అతి కిరాతకంగా ఆరుగురిని హత్య చేసిన హంతక ఉన్మాది రాజ్ కుమార్ కథ విషాదంగా ముగిసింది. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో సైతం తీసుకున్నాడు. కొత్తూరు మండలంలోని పెన్జర్ల రెవెన్యూ పరిధిలోని ఓ వెంచర్ సమీపంలోని వ్యవసాయ పొలంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది రాజ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించేందుకు మృతిని సోదరుడు, పెంజర్ల గ్రామంలో నివాసముండే మేనమామలను పిలిపించారు. వారు రాజ్ కుమార్ (29) మృతదేహాన్ని గుర్తించారు. మృతుని పక్కన పురుగుల మందు డబ్బా పడి ఉంది. ఘటనా స్థలాన్ని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితుడు రాజ్‌కుమార్.. షాబాద్‌లో ఓ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ ఉండేవాడు. దాంతో మే నెలలో ఇతనిపై బాలిక బంధువులు ఫిర్యాదు చేయడంతో షాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కింద కేసు నమోదు చేశారు. పోక్సో కేసు పెట్టారన్న కోపం పెంచుకున్న నిందితుడు.. శుక్రవారం
అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లి.. ఆమె తల్లి, అమ్మమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం బాలికను తీసుకొని దైవాలగూడానికి చేరుకొని, అతని సొంత ఇంట్లో భార్య, ఇద్దరు కుమారులను కుడా కత్తితో పొడిచి చంపాడు. తిరిగి అక్కడ నుండి బాలికను తీసుకొని సుమారు 200 మీటర్ల దూరంలో బాలికను కూడా హత్య చేసి పరారయ్యాడు. అనంతరం అతని తండ్రికి ఫోన్ చేసి.. ‘నేను ఆరుగురిని హత్య చేశాను.. నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్న’ అని చెప్పాడు. అయితే ఆరుగురి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం కొత్తూరు మండలం పెంచర్ల రెవెన్యూ పరిధిలోని ఓ వెంచర్‌లో మృతదేహం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. ఆ మృతదేహం రాజ్ కుమార్‌దిగా గుర్తించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితునికి ఆన్‌లైన్ బెట్టింగ్ కూడా అలవాటు ఉంది. ఆన్‌లైన్ బెట్టింగ్ పెట్టి సుమారు రూ.2కోట్లు అప్పు చేశాడు. దాంతోపాటు అతడు 16 సిమ్ కార్డులను తీసుకొని నెంబర్లు మారుస్తూ వాడుతున్నాడు.
వాడిని అంత ప్రశాంతంగా చనిపోనియాల్సింది కాదు..:
మృతుని సోదరుడు భాస్కర్
అభం శుభం తెలియని పసిపిల్లలతోపాటు మరో ముగ్గురి ప్రాణాలు తీసిన రాజ్‌కుమార్ అంత ప్రశాంతంగా చనిపోవాల్సింది కాదని, వాడిని ఎన్‌కౌంటర్ చేసి చంపాల్సిందని మృతుని సోదరుడు భాస్కర్ అన్నారు. వాడి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని ఏడుస్తూ పోలీసుల ముందు మొరపెట్టుకున్నాడు.
షాబాద్ నరహంతకుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



