నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ కాగా, ఆయన నేడు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నియామకం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో, తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ఆయన, సీనియర్ పార్లమెంటేరియన్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.



