Thursday, July 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘మణిపూర్‌’ మౌన రోదన

‘మణిపూర్‌’ మౌన రోదన

- Advertisement -

దేశం మొత్తం యుద్ధం కారణంగా మొదలైన ప్రభావాలతో కొట్టుమిట్టాడుతుంటే… అందులోని ఓ రాష్ట్రం మాత్రం తమ సొంత భూమిలో మొదలైన యుద్ధానికి ప్రాణాలు గుప్పిట పట్టుకుని, రక్షించమని… సొంత దేశంలోనే శరణార్థుల్లా బతుకుతున్నారు. అది ఏ రాష్ట్రమో ఎవరికీ తెలియకపోయినా ఆశ్చర్యమేమీ లేదు ఎందుకంటే… సమస్యను గుర్తించి, పరిష్కరించుకోవడం కంటే… కప్పేసి, లేదని చెప్తూ సంబరాలు చేసుకోవడమే మనకు అలవాటయి పోయింది. అలా మనం పట్టించు కోకుండా, పరామర్శించకుండా, స్వదేశంలోనే పరాయి అయిన రాష్ట్రమే..మణిపూర్. అక్కడ రేగిన ‘రాజకీయ చిచ్చు’ ఏండ్లు గడుస్తున్నా చల్లారడం లేదు. పూటకో ఇల్లు తగలబడుతూనే ఉంది. రోజుకో మనిషి చంపబడుతూనే ఉన్నాడు. అయినా ఎవరికీ పట్టింపు లేదు! అక్కడే పుట్టి పెరిగిన మేరీకోమ్ ప్రపంచ బాక్సర్ ఛాంపియన్ అయి, ఒలంపిక్‌లో పథకం సాధించినప్పుడు చప్పట్లు కొట్టి అభినందించాం. అక్కడి మీరాబాయి చాను కామన్వెల్త్‌లో బంగారు పథకం సాధించి, ఒలంపి‌క్స్‌లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంటే ‘మా దేశపు రత్నం’ అంటూ చంకలు గుద్దుకున్నాం. కానీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాల సంగతి మచ్చుకైనా మనకు తెలియడం లేదు. అక్కడి అల్లర్లలో తప్పుడు సమాచారం లోకానికి తెలీయకుండా మీడియాని నియంత్రించే ప్రయత్నంలో… అక్కడి అసలు నిజాలు కూడా ఎవరికీ తెలీయకుండా సమాధి కాబడుతున్నాయి. ఎక్కడో జరుగుతున్న యుద్ధం గురించి, దాని ప్రభావాల గురించి మాట్లాడుకుంటున్ మనం మన దేశ పరిస్థితులు, మానవాళి ఎలాంటి సమస్యలను తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

మణిపూర్‌లో మారణహో‌మం రెండు ముఖ్యమైన జాతుల చుట్టూ పరిభ్రమించింది. అవే మైతేయి, కుకీ, నాగజాతి ప్రజలు. అక్కడ జనాభా సంఖ్యలో ఎక్కువగా ఉన్న మైతేయిలు ఎంతోకాలంగా రాజకీయంగా బలంగా, అధికారంతో ఉన్నారు. ఎక్కువగా మణిపూర్ లోయ ప్రాంతాలలో వీరి నివాసాలు ఉన్నాయి. అయితే కుకీ, నాగజాతి ప్రజలు అల్ప సంఖ్యాకులు , వారికి ఆర్థిక, రాజకీయ బలాలు తక్కువ. వీరి నివాసం కొండ ప్రాంతాల్లో ఉంటుంది. వీరి మధ్య మొదలైన ఘర్షణ ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా వైరం కొనసాగుతూనే ఉంది. కొన్ని మతానికి సంబంధించినవి, మరికొన్ని అధికారానికి సంబంధించినవి. ఇలా చిన్న చిన్న గొడవలు రక్తం చిందేలా మారడానికి ముఖ్య కారణం మైతేయిలు తమకు కూడా ఎస్టీ హోదా ఇచ్చి, కొండ ప్రాంతాల మీద హక్కు ఇవ్వాలని అడగడమే. అప్పటికే రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న మైతేయిలకు ఎస్టీ హోదా గనుక వస్తే… గిరిజన భూముల మీద, ఉద్యోగాల మీద కూడా ఆ ప్రభావం పడి, వాళ్ల ఉనికే ప్రమాదంలో పడుతుందని కుకీల భయం. కుకీ, నాగ జాతీయులు వేరే మతస్తులు మాత్రమే కాక, ఎక్కువగా వలస దారులని, వాళ్లకు కొండ ప్రాంతాల మీద హక్కు ఉన్నట్లుగానే మా క్కూడా వాటి మీద హక్కూ, అధికారం కావాలని మైతేయిల వాదన. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్‌‌ల మీద దాడులు జరిపి, ఇరు వర్గాలు ఆయుధాల సేకరణ చేసి, ఒకరినొకరు మట్టి కరిపించుకున్నారు కానీ, ఎంతో మంది సామాన్య ప్రజలు వాళ్ల కుటుంబాలను కోల్పోయి రోడ్డున పడ్డారన్న సంగతి మాత్రం గుర్తించలేక పోయారు.

ఇది కేవలం రెండు వర్గాల మధ్య సమస్య కాదు, ఇది భూమి కోసం, మనుగడ కోసం రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇందులో మతాధిపత్య రాజకీయాలు, వర్గ ద్వేషం, వలసదారుల మీద ఏహ్యం బయటపడడం మాత్రం చాలా బాధాకరం. ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ప్రశాంతంగా ఉన్న మణిపూర్ ఇప్పుడు బాంబుల శబ్దాలతో దహించుకుపోగా ప్రజల జ్ఞాపకాలు మాత్రం ఆ పగిలిన గోడల వెనుక మిగిలిపోయాయి. ప్రతీసారి ఓ యుద్ధం మొదలవుతుంది. అందులో చివరికి ఎవరు గెలిచినా, ఎవరు ఓడిపోయినా ఆ ఫలితాల కంటే అక్కడ మరణించిన వారి అస్థికలే మనకు ఎక్కువగా కనబడతాయి. అక్కడి వారి ఆర్తనాదాలు విని, వినిపించనట్లు మనం ఎంతలా నటించినా… ఏదో ఒక పుస్తకంలో చీకటి చరిత్రలా మనం దాన్ని చదివినప్పుడు మనసు అడిగే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. సమస్యను గుర్తించడం లో ప్రభుత్వం కాస్త ఆలస్యం చేసిందనే నిజం అందరికీ తెలిసినా, అధికార పక్షం రాజకీయ బలం ఉన్న వర్గం వైపు మొగ్గు చూపి, తమను నిర్లక్ష్యం చేసిందనే అల్పసంఖ్యాకుల ఆవేదన ఎంత వరకూ నిజమో మనకు తెలియకపోయినా, ప్రజలకు నమ్మకం ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -