Thursday, July 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఘజనీ సైతం నివ్వెరపోయే ‘అయోధ్య’ దోపిడీ!

ఘజనీ సైతం నివ్వెరపోయే ‘అయోధ్య’ దోపిడీ!

- Advertisement -

అయోధ్య రామ మందిరం నుంచి జరిగిన విరాళాల చోరీ వార్త అమాయక భక్తులకు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. కానీ, ఇది మొదటి నుంచి జరుగుతూ వచ్చిన దానికి కొనసాగింపు మాత్రమే. ప్రజలను ఒక మతపరమైన ఉన్మాద సమీకరణలో ఉంచడం ద్వారా అక్కడి అక్రమాలు ప్రజల దృష్టికి రాకుండా దాచిపెట్ట గలిగారు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీచే నియమితులైన ఆలయ ట్రస్ట్ వ్యక్తులే ఈ దోపిడీ ఉదంతంలో కిరాయి గుండాలుగా వ్యవహరించారు. ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా ఈ చోరీని బహిరంగ దోపిడీగా వివరించాడు. దుర్మార్గమైన ‘ఓటు చోరీ’లో ప్రధాన నిందితుడైన జ్ఞానేశ్ కుమార్ గుప్తా కూడా ఈ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడిగా నాలుగేళ్లు పనిచేశాడు. ఆయన ‘అర్హతలకు మించి పనితనానికి మెచ్చిన’ మోడీ, గుప్తాను తదుపరి ఎన్నికల కమిషనర్‌గా నియమించాడు. దీన్నిబట్టి అర్హతలకన్నా విశ్వసనీయతే బాగా పనిచేస్తుందని ఇక్కడ చెప్పవచ్చు. ప్రధాన స్రవంతి మీడియా ఈ విషయం పట్ల మౌనం వహించినా, లేక చిన్నదిగా చూపే ప్రయత్నం చేసినా, రాముడు సైతం దోపిడీ నుంచి తప్పించుకోలేదని ప్రపంచం తెలుసుకున్నది.

ఈ దోపిడీకి సంబంధించిన లెక్కలు పరిధి దాటి విశృంఖలంగా ఉన్నట్లు అర్థమవుతున్నది. ప్రాథమికంగా దాదాపుగా రూ.200 కోట్ల మేరకు చోరీకి గురైనట్లు భావించినా అసలు దోపిడీ అంతకుమించి చాలా భారీగా ఉన్నట్టు స్పష్టమ వుతున్నది. ఇది కేవలం విరాళాల పెట్టెల నుంచి మాయమైన కరెన్సీ నోట్లకు మాత్రమే పరిమితం కాలేదు. భారీగా వచ్చిన బంగారం, వెండి, వజ్రాలు, అష్టధాతు దిమ్మెలు, శిలాఫలకాలు వంటి వాటితో పాటు రామాలయ నిర్మాణం గురించి జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిన నాటి నుంచి భక్తులు విరాళంగా ఇచ్చినవి కూడా ఈ చోరీలో మాయమయ్యాయి. వాటి వాస్తవ విలువ వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఇంత భారీ చోరీలో అరెస్టయిన వ్యక్తులు నేరస్తులు కాదు, లేక ముఖ్య లబ్ధిదారులు కూడా కాదు, వారు పాత్రధారులే తప్ప సూత్రధా రులు కాదు. 1989 నుంచి దిమ్మెల పలకాల రికార్డులు నిర్వహి స్తూ వస్తున్న వ్యక్తి ‘‘నాడు విరాళంగా వచ్చిన మట్టి దిమ్మెలు నేటికీ కరసేవక్ పురంలో భద్రపరచబడి ఉన్నాయి’’ అని చెప్పాడు. కానీ ఈ మధ్య విరాళంగా వచ్చిన బంగారం, వెండి దిమ్మెలు ఇటుకల రక్షణ బాధ్యత మాత్రం ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు అప్పగించబడింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే విరాళాల మాయం గురించిన ప్రశ్నలు తలెత్తడం గమనార్హం.

ఈ దోపిడీ సాఫీగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చాలా పకడ్బందీగా జరిగినట్లు అర్థమవుతున్నది. నృపేంద్ర మిశ్రా చెప్పిన ప్రకారం.. దాదాపు తొంభై శాతం నిర్దేశిత భద్రతా నియమాలన్నింటినీ ఉల్లంఘించింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం విరాళాలు లెక్కించే అతి రహస్యమైన గదిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండగా పై స్థాయిలో బాగా పలుకుబడి ఉన్న అధికారి ఆ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను అడ్డుకున్నాడు. లోపల లెక్కింపులో ఉన్నవారు తమ సొంత వ్యక్తులేనని అక్కడ నిఘా అవసరం లేదని తెలిపాడు. అయినప్పటికీ భద్రత ఏజెన్సీ మాత్రం ఆ గదిలో రహస్య కెమె రాలను ఏర్పాటు చేయగా, అవి అక్కడి కార్యకలాపాలను రికార్డు చేశాయి. పరిశోధనలో ఐదుగురు ఉద్యోగులలో ఒకరి ఇంటిలో ఆవు పేడ రాశి కింద నుండి పది లక్షల రూపాయలు స్వాధీనమయ్యాయి. ఈ వ్యక్తులకు రక్షణ ఆలయం, కేవలం ఆలయ ప్రాంగణం వరకే పరిమితం కాలేదు. అది బయటకు కూడా కొనసాగించబడింది. ప్రాంగ ణం విడిచి వెళ్లే ముందు డబ్బులు నిర్వహించే ఉద్యోగులను చిన్నచిన్న సంస్థలు కూడా ప్రతిరోజు తనిఖీలు చేస్తాయి. కానీ ఈ ఉద్యోగులు మాత్రం వేరు. వారిని ఇలాంటి తనిఖీల నుంచి మినహాయించారు. పొరపాటున ఏవైనా తనిఖీలు జరగకుండా ఉండడానికి ఉత్తర ప్రదేశ్ పోలీస్ లేదా ఇతర భద్రత ఏజెన్సీలను కరెన్సీ నోట్ల లెక్కింపు గది నుంచి ఉద్దేశపూర్వ కంగానే దూరంగా ఉంచారు. పై సంఘటనలు ఏవి కూడా యధాలాపంగా, యాదృచ్ఛికంగా జరిగినవి కావు.

ట్రస్టులోని పలుకుబడి ఉన్న అధికారి ఆదేశాల మేరకే జరిగినట్టు తెలుస్తోంది. మోడీ నియమించిన ఈ ట్రస్ట్ క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆరెస్సెస్‌ ఆలయ విభాగం. అందులోని సభ్యులందరూ అతనికి అత్యంత విశ్వాస పాత్రులు, ఆ‌రెస్సెస్‌ సిద్ధాంతాలకు, భావజాలానికి కట్టుబడిన వారు. ఇంకా చెప్పాలంటే రామాలయ నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నవారు. చట్టబద్ధమైన అవసరాల దృష్ట్యా ఈ ట్రస్టులో ఒక దళిత సభ్యుడిని కూడా చేర్చారు. అదీ సంఘ్‌ నేపథ్యం ఉన్న వ్యక్తినే.చంపత్ రాయ్ జీవితకాలపు సంఘ పరివార్ కార్యకర్త. గతంలో రామాలయం కోసం భూమి కొనుగోలు విషయంలో అతడిపై కొన్ని అభియోగాలు వచ్చాయి. కొద్ది రోజులలోనే రూ.మూడు కోట్లకు కొన్న భూమిని 24 కోట్లకు కొనుగోలు చేశాడు. ఈ వివాదం చాలా విస్తృతంగా బహిర్గతం కాగా మరికొన్ని ఇతర భూములకు కూడా అక్రమాలు గోల్‌‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఆలయ నిర్మాణ పూర్తి ప్రక్రియ రాయ్ పర్యవేక్షణలోనే పూర్తయింది. రోజువారి ఆలయ కార్యక్రమాలు స్వామి వారికి సమర్పించే ప్రతిదీ కూడా ఆయన ఆమోదం, అనుమతి లేకుండా ఉండదు. అలాంటి పరిస్థితులలో అంత భారీ ఎత్తున విరాళాల మాయం ఆయనకు తెలియకుండానే జరిగిందంటే నమ్మశక్యం కాదు. తన సొంత మనుషులే కాక మరో వ్యక్తి కూడా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నాడనేది ఏ మాత్రం సందేహం లేని విషయం. ఆయనే చంపత్ రాయ్ డ్రైవర్ టున్ను యాదవ్.

ఈ విధంగా నిస్సిగ్గుగా దొంగతనాలు వెలుగులోకి వచ్చిన మరుక్షణమే భారతీయ జనతా పార్టీ ఐటి విభాగం దీనికి ఒక రాజకీయ రంగు పులిమింది. ప్రతిపక్షాలను నిందించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ చోరీ విషయమై చర్చ జరగకుండా చూడాలని ఆదేశించాడు. ‘‘విరాళాల చోరీపై విమర్శ అయోధ్యను అప్రతిష్ట పాలు చేయడమేనని, శ్రీరాముడిని అవమానించడమేనని’’ పేర్కొన్నాడు. సంఘ్‌ పరివార్ మరో అడుగు ముందుకేసి నీచానికి దిగజారింది. ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద ప్రతిపక్షం సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు మైనర్ కూతురిపై విషప్రచారం చేయడం మొదలుపెట్టింది. కానీ ఈ మళ్లింపు రాజకీయం విజయవంతం కాలేదు. రామాలయ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులు, పలువురు శంకరాచార్యులు ఈ కుంభకోణం గురించి బాహాటంగా ప్రశ్నించారు. ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ వారసుడు మహంతి కమలనయన్ దాస్ ఒక ప్రకటనలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దానిపై దర్యాప్తు జరగ వలసిందే అన్నాడు. ఆయనకు కూడా ఈ దర్యాప్తు ప్రక్రియపైన విశ్వాసం లేక ‘‘ఎవరు దర్యాప్తు చేస్తారు? దర్యాప్తు చేసే వారంతా అవినీతిపరులే. ఇంత రభస సృష్టించిన వారెవరు సాధువులు, సన్యాసులు కారు. ఒకప్పుడు సైకిల్ పై తిరిగిన వారు నేడు విలాసవంతమైన కార్లలో ప్రయాణిస్తున్నారు. అంత:పురం లాంటి ఇండ్లల్లో నివసిస్తున్నారు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం సమాజానికి ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.

అవిముక్తేశ్వరానంద్ సరస్వతి కూడా మోడీ ఉద్దేశాన్ని తప్పుపట్టాడు. ‘‘మోడీ ఆలయ ట్రస్టును ప్రధానమంత్రి కార్యాలయానికి అనుసంధానంగా ఒక ప్రత్యేక విభాగం లాగా ఉంచి, తాను ఎంపిక చేసిన వ్యక్తులు దానిని నియంత్రిస్తూ ప్రతినెలా భక్తుల సమర్పించే కోట్ల రూపాయల విలువైన కానుకలను విరాళాలను కైంకర్యం చేయడానికే’’అని పేర్కొన్నాడు. వినయ్ కటియార్ కూడా ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరగాలని, అది కోట్ల మంది భక్తుల విశ్వాసానికి సంబంధించినదని ప్రకటించాడు. ఈ విధమైన ఆర్థిక అవినీతి రామాలయం పేరుతో కొత్తది కావచ్చు, కానీ మొదటి ఘటన మాత్రం కాదు. రామ జన్మభూమి ఉద్యమం మొదటి నుంచి వివాదాలమయం. ఆర్థిక అక్రమాల ఆరోపణలతో కూడినదే. గతంలో కూడా ఈ ఆలయ ఉద్యోగులు విరాళాల చోరీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎప్పటికప్పుడు తెరపైకి వచ్చాయి. భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత కూడా ఐదువేల కోట్లకు మించిన విరాళాలు సేకరించినప్పుడు అక్రమాలపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆ ఆరోపణలు ఎదుర్కొన్న వారే ఉన్నత స్థానాలలో ఉంటే అలాంటి విషయాలను కట్టడి చేయడం ఎవరితరం? కాపలాగా ఉండవల సిన మీడియా వారి పెంపుడు లేదా పోషక మీడియాగా మారితే ప్రజల కండ్లలో మట్టి కొట్టడం చాలా సులువు. అంటే ఒక రకంగా ప్రజలను మోసగించడం చాలా తేలిక. ఇంతకుముందు జరిగిందిదే.

ఈ సందర్భంగా బాబా లాల్ దాస్ ఉదంతం మనకు ఒక భయంకరమైన వాస్తవాన్ని చెబుతుంది. 1980 మొదట్లోనే అలహాబాద్ హైకోర్టు ఆయనను మహంత్ (పూజారి)గా నియమించింది. ఆ బాబ్రీ మసీద్ కాంప్లెక్స్‌లోని రామ్ లల్లా విగ్రహాల రక్షణ బాధ్యత ఆయనదే. బాబా లాల్ దాస్ బాహాటంగా అయోధ్య వివాదం కేవలం స్థానిక భూతగాదా మాత్ర మేనని దానికి రాజకీయరంగు అంటించవద్దని కోరాడు. అంతేకాక విశ్వహిందూ పరిషత్ ఈ వివాదాన్ని రాజకీయ కారణాలకు దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించాడు. ఎవరైతే ఆ రకంగా దానిని రాజకీయం చేస్తారో వారు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలను సృష్టించి హిందువుల ఓట్లను దండుకునే దురాలోచనతో ఉన్నట్లు దాస్ చెప్పాడు. శ్రీరాముడు పేరు మీద జరిగే మతవిద్వేషాన్ని దాస్ బలంగా ఖండించాడు. కొన్ని శతాబ్దాలుగా అయోధ్యలో హిందువులు ముస్లింలు కలిసి మెలిసి ప్రశాంతంగా జీవించారని గుర్తుచేశాడు. అంతేకాక అతను ఎల్కే అద్వానీ రథయాత్రను కూడా వ్యతిరేకించాడు. పర్యవసానంగా నాటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఆయన్ను ప్రధాన పూజారి పదవి నుం‌చి తొలగించింది. తన అభిప్రాయాలు నిక్కచ్చిగా, నిర్భయంగా వెల్లడించడంతో సంఘ పరివార్ విశ్వహిందూ పరిషత్ వారికి లక్ష్యంగా మారాడు.దాస్‌ను నవంబర్ 16, 1993 నాడు రాణిపూర్ చెత్తర్ గ్రామంలో కాల్చి చంపింది.

విరాళాల చోరీ జరిగి రెండు వారాలు దాటినా నేటికి అయోధ్య లేదా మరి ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లో కూడా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కనీసం ఒక్క పోలీస్ ఫిర్యాదు లేకుండానే అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంఘం సిట్‌‌ను నియమించింది. చంపత్ రాయ్ లేదా అనిల్ మిశ్రా పేర్లు లేకుండా సిట్ ఏ రకంగా లేదా ఎవరిని దర్యాప్తు చేస్తుంది? అది ఏ మేరకు అర్థవంతం అవుతుంది? ఇంత పెద్ద నేరానికి కేసు నమోదు కాకుండా దర్యాప్తు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఈ భయాందోళనలకు పునాది బలం లేకపోలేదు. అనుకున్న తీరుగానే సంఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. తాత్కాలికంగా తిమింగలాలను కాపాడుతూ చిన్న చేపలను చిక్కించుకుంటున్నారు. పావులను పట్టుకున్నారు కానీ వారి వెనుకనున్న పెద్ద తలకాయల జోలికి పోవడం లేదు. కొంతకాలానికి ఈ మొత్తం కుంభకోణాన్ని కొట్టివేస్తూ ఇది కేవలం దేశాన్ని హిందూయిజాన్ని అభాసుపాలు చేసే కుట్రగా కూడా పేర్కొనవచ్చు. దేనికైనా అవకాశం ఉన్నది.

ఇంత పెద్ద చోరీ ఉదంతం మనకేమీ తెలియజేస్తున్నదంటే మతం ముసుగులో ఉంటూ మత రాజకీయాలకు పాల్ప డుతూ మత విద్వేషాలను వ్యాపింపజేసేవారికి అసలు మతం పట్ల కనీస చిత్తశుద్ధి అంకితభావం లేవు. ఎవరి పేరుతో, ఎవరిపై విశ్వాసంతో వారు ప్రజలను సమీకరించుతున్నారో వారినే వారు మోసగిస్తున్నారు. ఇలాంటి వారి గురించి తులసీదాస్ చెప్పిందే అక్షర సత్యం. ‘‘ఎవరైతే తమకు తామే రామ భక్తులమని చెప్పుకుంటారో, ఎవరైతే సంపద, దురాశ, కోపం, కామం, కోరిక కలిగి ఎవరైతే మతానికి చెందిన జెండాలను ప్రదర్శిస్తూ తమ మోసపూరితమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తారో ఈ ప్రపంచంలో అలాంటి వారికి వ్యతిరేకుల్లో మొట్టమొదటి వాడిని నేనే’’ అని గర్వంగా చెప్పుకున్నాడు. తులసీదాస్ చెప్పిన అవలక్షణాలన్నీ ఈనాడు మనకు అయోధ్య కమిటీ సభ్యుల్లో స్పష్టంగా కనబడుతున్నాయి.

(పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో)
అనువాదం: శ్రీ శ్రీ కుమార్
బాదల్ సరోజ్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -