Thursday, July 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇక టైమ్ మార్చేదే లే

ఇక టైమ్ మార్చేదే లే

- Advertisement -

కీలక బిల్లుకు యూఎస్ హౌస్ ఆమోదం
డేలైట్ సేవింగ్ టైమ్‌ను శాశ్వతం చేసే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
ఇకపై ఏడాదికి రెండుసార్లు గడియారాల సమయాన్ని మార్చాల్సిన అవసరం లేదు!

న్యూయార్క్ : అమెరికాలో ఏటా రెండుసార్లు గడియారాల సమయాన్ని మార్చే సాంప్రదాయానికి స్వస్తి పలికే దిశగా అడుగులు పడ్డాయి. డేలైట్‌ సేవింగ్ టైమ్‌ని శాశ్వతం చేస్తూ రూపొందించిన ప్రతిపాదనకు యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. వేసవి సమయంలో గడియారాలను ఓ గంట ముందుకు జరిపే విధానమే డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌. ఆ తర్వాత శీతాకాలం రాగానే మళ్లీ గడియారంలో ముళ్లులను వెనక్కి జరుపుతారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఇకపై అమెరికన్లు ఏడాదికి రెండుసార్లు ఇలా తమ గడియారాలలో సమయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏడాది పొడవునా ఒకే సమయం అమల్లో ఉంటుంది.

గందరగోళం దూరం కావాలని
అమెరికాలో ప్రతి ఏటా వేసవి, శీతాకాలాల ఆధారంగా గడియారంలో సమయాన్ని ఒక గంట ముందుకు, వెనక్కి మార్చే విధానం దశాబ్దాలుగా అమల్లో ఉంది. అయితే, ఈ మార్పుల వల్ల అనవసరమైన గందరగోళం, ప్రజల దినచర్యల్లో అంతరాయం కలుగుతోందని సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరిట సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 308 ఓట్లు, వ్యతిరేకంగా 117 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమెరికన్లకు గొప్ప వార్త అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.

బిల్లుపై భిన్నాభిప్రాయాలు
సాయంత్రం వేళల్లో ఎక్కువ సమయం పగటి వెలుతురు ఉండటం వల్ల ప్రజలు ఆరుబయట గడిపేందుకు, స్థానిక వ్యాపారాలు పుంజుకునేం దుకు ఇది దోహదపడుతుందని బిల్లు మద్దతు దారులు వాదిస్తున్నారు. వైట్ హౌస్ కూడా ఈ సంస్కరణకు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, ఈ బిల్లుపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలంలో పగటి సమయం ఆలస్యంగా ప్రారంభమవుతుందని, దీనివల్ల పాఠ శాలలకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కటిక చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తుం దని డెమొక్రాట్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

శాశ్వతంగా డేలైట్ సేవింగ్ టైమ్‌
ఇటీవల జరిగిన ఒక జాతీయ సర్వే ప్రకారం 56 శాతం మంది అమెరికన్లు సాయంత్రం వేళ ఎక్కువ వెలుతురు ఉండేలా ఈ డేలైట్ సేవింగ్ టైమ్‌ను శాశ్వతం చేయడానికే మొగ్గు చూపారు. ప్రతినిధుల సభలో ఈ బిల్లు భారీ మెజారిటీతో పాస్ అయినప్పటికీ, ఇది చట్టంగా మారాలంటే తదుపరి సెనెట్ ఆమోదం కూడా తప్పనిసరి. సెనెట్ కూడా ఈ బిల్లును ఆమోదిస్తే, ఆ తర్వాత అధ్యక్షుడి సంతకంతో అమెరికాలో గడియారాలు తిప్పే విధానానికి శాశ్వతంగా తెరపడనుంది.

మార్పు తీసుకువస్తానని ట్రంప్ హామీ
ప్రస్తుతం మార్చి-నవంబర్ మధ్య పాటిస్తున్న సమయమే ఇకపై అమెరికాలో శాశ్వత ప్రామాణిక సమయంగా పాటించనున్నారు. డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌లో మార్పుపై అమెరికా ప్రతినిధుల సభలో చాలా ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. రెండోసారి అధికారం చేపడితే ఈ విధానంలో మార్పు తీసుకువస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హౌస్ ఈ చట్టాన్ని ఆమోదించింది. డేలైట్‌ సేవింగ్‌ విధానాన్ని తొలిసారి అమెరికా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పాటించింది. విద్యుత్‌ను ఆదా చేయడం కూడా దీని వెనుక ఉన్న ప్రధాన కారణం. శీతాకాలం రాగానే మళ్లీ గడియారంలో ముళ్లులను వెనక్కి జరిపి, ప్రామాణిక సమయాన్ని అనుసరిస్తారు. అనంతరం ఈ విధానాన్ని కొంత కాలం రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మళ్లీ డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌ విధానాన్ని తీసుకువచ్చారు. 1969లో దీనిని ప్రామాణీకరించే చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. నాటి నుంచి అక్కడి ప్రజలు ఏడాదికి రెండుసార్లు తమ వాచ్‌లలో సమయాన్ని మార్చుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -