Thursday, July 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎస్సీ విద్యార్థులకు అండగా ఉంటాం

ఎస్సీ విద్యార్థులకు అండగా ఉంటాం

- Advertisement -

​ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఎస్సీ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో కేంద్ర మంత్రితో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమావేశమై పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, సంక్షేమ విద్యాసంస్థల ఆధునీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల సమర్థ అమలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు. రూ.300 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల నుంచి తక్షణమే రూ.150 కోట్ల విడుదలకు సానుకూలంగా స్పందించారు. అలాగే షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్ల అభివృద్ధికి ప్రతిపాదించిన రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై వచ్చే నెలలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలను 40 శాతం పెంచడంతో పాటు 16 సంవత్సరాల తర్వాత కాస్మెటిక్ చార్జీలను 212 శాతం పెంచిందని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉండటం వల్ల సంక్షేమ కార్యక్రమాల అమలుపై అదనపు ఆర్థిక భారం పడుతోందని మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో అత్యవసరంగా కల్పించాల్సిన సదుపాయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -