ఈసీకి జాన్ బ్రిట్టాస్ లేఖ
ఆన్లైన్ దరఖాస్తుదారులకు అదనపు షరతులు సరికాదు
సమానత్వ హక్కుకు విరుద్ధం పాత వివరాలు అందించడం ఆచరణ సాధ్యం కాదు
న్యూఢిల్లీ : కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6 ఆన్లైన్ దరఖాస్తులో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించిన కొత్త డిక్లరేషన్ను చేర్చిన ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయంపై సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్పు చట్టబద్ధ అధికార పరిధిని దాటి చేసిన చర్యగా (అల్ట్రా వైర్స్) కనిపిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆ నిబంధనను ఉపసంహరించుకోవాలని వివరించారు. ఈ మేరకు జాన్ బ్రిట్టాస్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు లేఖ రాశారు. ప్రస్తుతం ఆన్లైన్ ఫారం-6లో కొత్త ఓటరు.. ఆయన తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు సర్ అనంతరం రూపొందించిన ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అనే వివరాలను తప్పనిసరిగా ప్రకటించాల్సి వస్తోంది. అయితే డౌన్లోడ్ చేసుకునే ఆఫ్లైన్ ఫారం‘6లో మాత్రం ఈ నిబంధన లేదు. సాధారణంగా ఫారం‘6లో మార్పులు చేయాలంటూ ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లేదా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960లో సవరణలు చేయాల్సి ఉంటుందనీ, అలాంటి చట్టసవరణలు లేకుండానే ఈసీ కొత్త ప్రకటనను చేర్చిందని బ్రిట్టాస్ పేర్కొన్నారు. అందువల్ల ఈ చర్యకు చట్టబద్ధమైన ఆధారం లేదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీకి విస్తృత అధికారాలు ఇచ్చినప్పటికీ.. పార్లమెంటు రూపొందించిన చట్టాలను మార్చే అధికారం ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
ఆన్లైన్ దరఖాస్తు చేసేవారికే అదనపు షరతు విధించడం, ఆఫ్లైన్ దరఖాస్తుదారులకు అది వర్తించకపోవడం రాజ్యాంగంలోని సమానత్వ హక్కు (ఆర్టికల్ 14)కు విరుద్ధమని బ్రిట్టాస్ పేర్కొన్నారు. మొదటిసారి ఓటర్లుగా నమోదు చేసుకునే యువత, విద్యార్థులు, వలస కార్మికులు, అనాథలు, దత్తత పిల్లలు, కుటుంబాలకు దూరమైనవారు, ఎన్నో ఏండ్ల క్రితం ఇతర నియోజకవర్గాలకు మారిన కుటుంబాల వారికి పాత ఓటరు వివరాలు సమర్పించడం ఆచరణలో సాధ్యం కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 2002-03లో రూపొందించిన పాత ఓటర్ల జాబితాలు కూడా చాలా చోట్ల అందుబాటులో లేవని గుర్తు చేశారు. ఈ కొత్త డిక్లరేషన్ లేకపోవడం వల్ల ఏ దరఖాస్తునూ తిరస్కరించకూడదనీ, పెండింగ్లో ఉంచకూడదని ఎన్నికల కమిషన్ను ఆయన కోరారు. ఇలాంటి నిబంధన అవసరమని ఈసీ భావిస్తే.. చట్టబద్ధంగా సంబంధిత నిబంధనల్లో సవరణలు చేసి మాత్రమే అమలు చేయాలని సూచించారు. అయితే ఈసీకి చెందిన ఒక అధికారి పీటీఐతో మాట్లాడుతూ.. ఫారం-6ను అధికారికంగా సవరించలేదనీ, కేవలల పరిపాలనా సూచనల ద్వారానే ఈ డిక్లరేషన్ను చేర్చామని చెప్పారు. దీనితో కొత్త ఓటర్ల వివరాలను గుర్తించడం సులభమవుతుందని, అవసరమైన పత్రాల సంఖ్య కూడా తగ్గుతుందని వివరించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన సర్ ప్రక్రియపై ఇప్పటికే వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఫారం‘6లో ఈ కొత్త డిక్లరేషన్ చేర్పు మరోసారి ఎన్నికల కమిషన్ చర్యలపై చర్చకు దారి తీసింది.



