Thursday, July 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

- Advertisement -

ఉద్యోగాలు ఊడగొడుతున్న మోడీ సర్కార్‌
ఉపాధి కల్పనను ప్రాథమిక హక్కుగా మార్చాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను
వెంటనే భర్తీ చేయాలి : మహాధర్నాలో సీపీఐ(ఎం)
పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
అందరూ శ్రామికవర్గాలను మోసం చేసేవారే : రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ
నెలవారీ వేతనాల్లేవ్‌ : ‌కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ ‌వీరయ్య
బలమైన పోరాటాలు రావాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
యువత పోరాటాల్లోకి రావాలి : రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారతదేశంలో నాడు నిరుద్యోగం ఉండేదనీ, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే చర్యలకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ ‌పాల్పడుతోందని సీపీఐ(ఎం) పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. తిండి, చదువు, వైద్యం, ఉపాధి కల్పన, పెన్షన్‌ ఇవ్వడాన్ని ప్రజల ప్రాథమిక హక్కులుగా మార్చాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాబ్‌ క్యాలెండర్లు విడుదల చేసి తమ పరిధిలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అధ్యక్షతన ‘నిరుద్యోగుల మహాధర్నా’ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. నీట్‌ ‌పరీక్షాపత్రం లీకేజీతో 25 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ఇదే అంశంపై ఢిల్లీలో వాంగ్‌‌చుక్‌ ‌నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు 24 శాతం, తెలంగాణలో 17 శాతం, హైదరాబాద్‌ ‌నగరంలో 10 శాతం మంది ఉన్నారని వివరించారు.

దేశంలో ఐదేండ్లుగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నదని ఎత్తిచూపారు. మనిషి పనిని సులభతరం చేసేలా యంత్రాలుండాలిగానీ, ఉపాధిని దెబ్బతీసేలా ఉండకూడదని చెప్పారు. కార్పొరేట్‌ ‌సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించి యంత్రాల ద్వారా అధిక లాభాలు గడించే పనిలో పడ్డాయన్నారు. ఈ పరిస్థితి ప్రమాదకరమని హెచ్చరించారు. దేశ అవసరాలకు వాడాల్సిన సహజవనరులను మోడీ సర్కారు అంబానీ, అదానీ లాంటి సంస్థలకు కట్టబెడుతున్న తీరును ఎండగట్టారు. ఖనిజాలను కొల్లగొట్టేందుకు చత్తీస్‌‌గఢ్‌ అడవుల నుంచి ఆదివాసీ గిరిజనులను బలవంతంగా వెళ్లగొడుతున్నారని వాపోయారు. అభివృద్ధి ముసుగులో పాలకులు కార్పొరేట్లకు 15 లక్షల ఎకరాలను కట్టబెట్టారని విమర్శించారు. ఆ భూములను కోల్పోయిన రైతులంతా ఇప్పుడు నగరాలకు వలసెళ్లుతున్నారనీ, అక్కడ పనిదొరక్క తక్కువ కూలికి పనిచేస్తున్నారన్నారు. ఓవైపు నిరుద్యోగుల సంఖ్య పెరగడం, మరోవైపు భూములు కోల్పోయి రైతులు, వ్యవసాయ కూలీలు రోడ్డున పడటం మంచి పరిణామం కాదని తెలిపారు. మరోపక్క ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిన తీరును విడమర్చి చెప్పారు. నిరుద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కకుండా కేంద్ర పాలకులు మతం, కులం, ప్రాంతం, భాషల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతున్న తీరును ఎండగట్టారు. యువత రాజకీయ చైతన్యం పెంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉపాధి కోసం విడివిడిగా కాకుండా ఐక్యపోరాటాలు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ‌శ్రామిక వర్గాలకు మోసం చేసే పార్టీలే : జాన్‌‌వెస్లీ
నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ హామీలను నెరవేర్చడంలో గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ విమర్శించారు. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని మోసం చేయడం వల్లే నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు కాంగ్రెస్‌ ‌పార్టీకి మద్దతిచ్చి అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌‌రెడ్డి సర్కారు ఆ హామీని బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు కొట్లాడుతుంటే ఎండ్రిన్‌ ‌తాగి చావండి అని సీఎం అనడం, బజ్జీలు, పకోడీలు వేసుకోవాలని బీజేపీ ఎంపీలు ఉచిత సలహాలివ్వడం ఏంటి? అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తమలా కూలినాలి చేయొద్దని అప్పులు చేసి చదివిస్తుంటే… పేద విద్యార్థులు తినీతినక ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతుంటే ఆ మాటలేంటి అని నిలదీశారు.

రేవంత్‌‌రెడ్డీ నిరుద్యోగులతో పెట్టుకోకుండా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ, లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగుల పక్షాన ఆగస్టులో జిల్లా, మండల కేంద్రాల్లో సదస్సులు, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఉద్యోగాల భర్తీ, ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ‌పార్టీలు శ్రామిక వర్గాలకు మోసం చేసే పార్టీలేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు? భూస్వాములు, కార్పొరేట్లకు ఎవరు మేలు చేస్తున్నారు? తమ పక్షాన ఎవరు కొట్లాడుతున్నారు? అనే దాన్ని యువత గుర్తించి రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

నెలవారీ వేతనం పొందేవారి సంఖ్య తగ్గుతోంది : ఎస్‌.వీరయ్య
మోడీ ప్రభుత్వం వచ్చాక దేశంలోనే నెలవారీ వేతనం పొందే వారి సంఖ్య వేగంగా తగ్గుతున్నదనీ, కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌ ‌విధానం పెరిగిపోతున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నదని చెప్పారు. మోడీ సర్కార్‌ ‌వచ్చాక మ్యాన్‌‌ఫాక్చరింగ్‌ ‌రంగం మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. దేశంలోని ప్రజలు జీతం కోసం పనిచేయరనీ, అభివృద్ధి కోసమే శ్రమిస్తారని మోడీ ప్రభుత్వం మాట్లాడటం తగదన్నారు. దేశంలోని యువత ఆగ్రహంతో ఉందనీ, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్న తీరును వివరించారు. ఇప్పటికైనా మోడీ సోయిలోకి వచ్చి కండ్లు తెరవాలనీ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్‌ ‌చేశారు.

బలమైన పోరాటాలు రావాలి : జూలకంటి
ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలు ఏమయ్యాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఉపాధి కల్పన కోసం కొత్త పరిశ్రమలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. ప్రజల్ని కేంద్ర, రాష్ట్ర పాలకులు మోసగిస్తున్న తీరును ప్రజలు, యువత పసిగట్టాలని కోరారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బలమైన పోరాటాలు రావాలని పిలుపునిచ్చారు.

అంబానీ, అదానీ, భగవత్‌ ‌చెప్పినట్టు మోడీపాలన : పోతినేని
అంబానీ, అదానీ, మోహనభగవత్‌ ‌చెప్పినట్టుగా మోడీ పాలన సాగుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌‌రావు విమర్శించారు. రోడ్లు, జలమార్గాలు, ఎయిర్‌‌పోర్టులు, ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగిస్తూ పోవడాన్ని తప్పుబట్టారు. యువత మేల్కొని పోరాటాల్లోకి రావాలనీ, యువత పోరాటాలకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని హామీనిచ్చారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌, ఓయూ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌ ఆర్‌ఎల్‌.మూర్తి, నిరుద్యోగ జేఏసీ నేతలు డి.ఉపేందర్‌, కొడంగల్‌ ‌రవి మాట్లాడుతూ…తామేమీ వారి ఆస్తులు అడగట్లేదనీ, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, జాబ్‌‌క్యాలెండర్‌, రాజీవ్‌ ‌యువవికాసం ‌హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగుల మరణాలు ఎవ్వరికీ పట్టవా అని నిలదీశారు. గ్రూపు-1 ఫలితాలను అర్థరాత్రి విడుదల చేయడాన్ని తప్పుబట్టారు.

ఆ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖలో మూడులక్షలు, రక్షణ శాఖలో లక్షన్నర, ఆరోగ్య శాఖలో 1.60 లక్షలు, ఇలా మొత్తంగా 9.64 లక్షల ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని మోడీ సర్కారు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మోడీ సర్కారు దమ్ముంటే 2014 నుంచి ఇప్పటివరకూ భర్తీ చేసిన ఉద్యోగాలపై పార్లమెంట్‌లో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ మహాధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్‌, మల్లు లక్ష్మి, బండారు రవి కుమార్‌, ఎమ్‌‌డీ.జహంగీర్‌, అబ్బాస్‌, నున్నా నాగేశ్వర్‌‌రావు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటరమేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -