రూ.7 కోట్ల విలువైన మందులకు
రూ.13 కోట్ల బిల్లులా..?
మందుల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలి : సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అందాల్సిన వైద్య సేవలపై అవినీతి నీలినీడలు కమ్ముకున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రితోపాటు పలు ప్రభుత్వ దవాఖానాల్లో ‘లోకల్ పర్చేజ్’ (స్థానిక కొనుగోళ్లు) పేరుతో భారీ కుంభకోణం చోటుచేసుకుందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, ఈ దోపిడీలో భాగస్వాములైన అధికారులను, సరఫరా సంస్థలను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని మారుమూల జిల్లాల నుంచి పేదలు ఎంతో నమ్మకంతో గాంధీ ఆస్పత్రికి వస్తుంటారని తెలిపారు. అక్కడ రోగులకు ఉచితంగా అందాల్సిన మందులను వైద్యులు బయట షాపుల్లో కొనాలని రాసిస్తున్నారని, మరోవైపు ఆస్పత్రి అవసరాల కోసం చేసే స్థానిక కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేవలం రూ.7 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేసి, కంపెనీలతో కుమ్మక్కై ఏకంగా రూ.13 కోట్ల బిల్లులు సృష్టించారని చెప్పారు. పేదల కోసం ఖర్చు చేయాల్సిన ప్రజాధనాన్ని అవినీతి అధికారులు స్వాహా చేస్తున్నారని, ఈ మందుల కుంభకోణం తీరు చూస్తుంటే కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరి పాత్ర ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. కేవలం కొంతమందిని బలిపశువులను చేసి వదిలేయకుండా, ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న చిన్న, పెద్ద అధికారులందరి పాత్రపైనా నిగ్గుతేల్చాలనీ, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు.
నిఘా పెట్టాల్సిందే.. : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొనుగోళ్లు, నిల్వలు, పంపిణీపై ప్రభుత్వం నిరంతర నిఘా ఉంచాలనీ, మందుల కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయనీ ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని, పేదలకు నాణ్యమైన వైద్యం, మందులు ఉచితంగా అందేలా చూడాలని కోరారు.
ప్రభుత్వ దవాఖానాల్లో ‘మందుల’ మాఫియా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



