కాలేజీ యాజమాన్యాల పై కఠినంగా వ్యవహరించనున్న ఇంటర్ బోర్డు
ఈ నెల చివరి నాటికి ప్రక్రియ పూర్తికి కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రయివేటు జూనియర్ కళాశాలల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు (ఇంటర్మీడియట్ బోర్డ్ అఫిలియేషన్) పక్రియపైన ఈ మేరకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇక నుంచి జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డ్ రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ విషయంలో కఠినంగా వ్యవహారించాని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ విషయంలో ఇక నుంచి జిల్లా ఇంటర్ విద్యా అధికారులను బాధ్యులను చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే బాధ్యతను కేవలం కళాశాలల యాజమాన్యాలకే వదిలేయకుండా, జిల్లా పరిధిలో ఉన్న అన్ని కళాశాలలు దరఖాస్తులు చేసుకునేలా జిల్లాకు చెందిన జిల్లా ఇంటర్ విద్యా అధికారులే బాధ్యత వహించాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. ఈ నెలాఖరు (జూలై ) వరకు అనుబంధ గుర్తింపు పక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇంటర్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోని ప్రయివేటు జూనియర్ కళాశాలలు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఇలాంటి కళాశాలల పట్ల కొంత కఠినంగానే వ్యవహారించాలని రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ విషయంలో జాప్యం చేయకుండా ఒక కాలపరిమితిలోపు ఈ పక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాష అభినవ్ ఇప్పటికే జిల్లా అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం పెండింగ్ ఉన్న అఫిలియేషన్ కోసం కళాశాలల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి వాటిని పరిష్కరిస్తున్నారు. నియమ నిబంధనల ప్రకారం ఏమైనా పత్రాలు తక్కువగా ఉంటే ఆయా పత్రాలను జత చేసేందుకు కళాశాలలకు కొంత గడువు ఇస్తున్నారు. ప్రస్తుతం బోర్డ్ వద్ద పెండింగ్ ఉన్న అనుబంధ గుర్తింపు దరఖాస్తులను పరిశీలించి, ప్రతి రోజూ 50 నుంచి 60 దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్టు ఇంటర్ వర్గాలు చెబుతున్నాయి. అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రతి ఏటా తీవ్ర ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ సారి జులై చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత బోర్డ్ నియమనిబంధనల ప్రకారం కళాశాలల ల్యాబ్స్ ఇతర అంశాలపై దృష్టి పెట్టాలని బోర్డ్ కార్యదర్శి అభిలాష అభినవ్ భావిస్తున్నారు.
గతంలో వార్షిక పరీక్షల నాటికి కూడా గుర్తింపు పొందకుండా కనీసం రిజిస్ట్రేషన్ కాలేజీల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందని (ఇంటర్ బోర్డ్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోని) ప్రయివేటు జూనియర్ కళాశాల ఒక్కటి కూడా ఉండకూదని ఇంటర్ బోర్డ్ భావిస్తున్నది. ఇందుకు జిల్లా అధికారులను బాధ్యులను చేస్తే కొంత వరకు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని కళాశాలలు ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకునేలా చూడాలని, అలాగే ఇంటర్ నుంచి అనుబంధ గుర్తింపు కోసం కూడా అందరూ దరఖాస్తులు చేసుకునేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇంటర్ బోర్డ్ ఆదేశించినట్టు సమాచారం. భవిష్యత్తులో ఆయా కళాశాల గుర్తింపు విషయంలో ఏమైనా వివాదాలు వచ్చినా, లేదా ఏదైనా సంఘటనలు జరిగినా అందుకు జిల్లా అధికారులను బాధ్యులను చేయనున్నారు.ప్రత్యేక కోర్సులు నిర్వహించే కళాశాలకు నోటీసులు..జరిమానా..
ఇంటర్ బోర్డు నియమ నిబంధనలను విరుద్ధంగా ప్రత్యేక కోర్సుల పేరుతో ప్రచారం చేసుకుంటున్న, ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న పలు జూనియర్ కళాశాలపైన ఇంటర్ బోర్డ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. జూనియర్ కళాశాలల పేరుతో అనుమతి తీసుకుని ఐఐటి, నీట్ కోర్సుల పేరుతో ప్రచారం చేసుకునే జూనియర్ కళాశాలలను గుర్తించింది. ఇందులో భాగంగా దాదాపు వంద జూనియర్ కళాశాలలను గుర్తించి నోటీసులను జారీ చేసింది. మరి కొన్ని కళాశాలలకు రూ.70 లక్షల వరకు జరిమానాలు విధించినట్టు సమాచారం. ఇంటర్ బోర్డ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక కోర్సుల నిర్వహణకు అనుమతి లేదన్న సంగతి తెలిసిందే. ఇక నుంచి కళాశాలల వెబ్ సైట్ తో పాటు ఆయా కళాశాలలు పలు రూపాల్లో చేసుకునే ప్రచారాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఇంటర్ కోర్సులకు ప్రత్యేక కోర్సులు కలిసి ఉన్నట్టు గుర్తిస్తే ఇంటర్ బోర్డ్ నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేసి జరిమానా విధిస్తున్నారు. అప్పటికి సరిదిద్దుకోకపోతే ఆయా కళాశాలల అఫిలియేషన్ రద్దు చేసేలా నిబంధనలున్నాయనీ, వాటిని అమలు చేస్తామని ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ లేకుంటే డీఐఈఓలదే బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



