100 మంది రైతులు- 100 వినూత్న వ్యవసాయ కార్యక్రమాలు
రైతుల ఆదాయం పెంపు.. లాభసాటి సాగు లక్ష్యం
కొత్త సాంకేతికతలు,
ఆధునిక సాగు పద్ధతులు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, గ్రామీణ ప్రాంతాల్లో వినూత్న వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు నారాయణపేట జిల్లా కోస్గి డివిజన్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ కే-100′ 100 మంది రైతులు, 100 వినూత్న వ్యవసాయ కార్యక్రమాలు’ ప్రారంభించింది. ఇప్పటికే 100 మంది ప్రగతిశీల రైతులను గుర్తించి, ప్రతి రైతుకూ ఒక ప్రత్యేక వినూత్న వ్యవసాయ కార్యకలాపాన్ని కేటాయించారు. ఈ రైతులు తమ తమ గ్రామాల్లో ఆదర్శ నమూనా క్షేత్రాలను ఏర్పాటు చేసి, ఇతర రైతులకు కొత్త సాంకేతికతలు, ఆధునిక సాగు పద్ధతులు, ఆదాయాన్ని పెంచే విధానాలను పరిచయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సహజ వ్యవసాయం, సేంద్రియ సాగు, ఉద్యాన పంటలు, పూల సాగు, పశుపోషణ, కోళ్ల పెంపకం, మత్స్య పెంపకం, సమగ్ర వ్యవసాయ విధానాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రత్యక్ష మార్కెటింగ్, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ/టి), వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, నీటి సంరక్షణ, సూక్ష్మ పోషకాల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించి ప్రోత్సహించనున్నారు. ప్రధానంగా సంప్రదాయ సాగుకే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టి, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించారు. రైతులను ఉత్పత్తిదారులుగానే కాకుండా వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రాజెక్టు అమలులో వ్యవసాయ శాఖతోపాటు కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర అనుబంధ శాఖల సాంకేతిక సహకారం ఉంటుంది. రైతులకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సలహాలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, ప్రభుత్వ పథకాల అనుసంధానం, మార్కెట్ అవకాశాల కల్పన వంటి అంశాల్లో పూర్తి సహాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా 100 ఆదర్శ వ్యవసాయ నమూనాలు రూపొందడంతోపాటు, ఇతర రైతులు కూడా ఈ నమూనాలను అనుసరించి వినూత్న వ్యవసాయ పద్ధతులను స్వీకరించే అవకాశం కలుగుతుంది. రైతుల ఆదాయం పెరగడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం, వ్యవసాయంలో కొత్త సాంకేతికతల వినియోగం పెరగడం, కోస్గి డివిజన్‌ను రాష్ట్రంలో ఆదర్శ వ్యవసాయ ప్రాంతంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ శాఖ పేర్కొంది.
క్షేత్ర స్థాయిలో కలెక్టర్ ప్రియాంక పరిశీలన
రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్.ప్రియాంక అన్నారు. నారాయణపేట్ జిల్లా కోస్గి మండలం మల్లారెడ్డిపల్లి రైతు వేదిక ముషీరిఫా పరిధిలో కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్ కె-100’ చాలా ఉపయోగకరమైందని, ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ చెప్పారు.రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్న వంకాయ, పచ్చిమిర్చి సాగు, స్టేకింగ్ విధానంలో టమాట సాగు, పూల సాగు (ఫ్లోరికల్చర్) పొలాలను ప్రత్యక్షంగా ఆమె పరిశీలించారు. రైతులు అవలంబిస్తున్న ఆధునిక సాగు విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పంటల నిర్వహణ తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వినూత్న వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగుతున్న రైతులను అభినందించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు, కరువును తట్టుకునే పంటల రకాలు, స్వల్పకాలిక రకాలు సాగు చెయ్యాలని సూచించారు. వర్షపు నీటిని ఆదా చేసుకోవడానికి ఫారం పాండ్స్ తవ్వుకోవాలని చెప్పారు. సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు, కూరగాయలు, పూల సాగు వంటి పంటల వైవిధ్యీకరణ ద్వారా అధిక ఆదాయం పొందొచ్చని వివరించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి ”ప్రాజెక్ట్ కె- 100” ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేసేందుకుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కూరగాయలు, పత్తి విత్తనాలు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోస్గి డివిజన్ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు (ఎమ్‌ఏఓలు), వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్స్, రైతులు పాల్గొన్నారు. అలాగే కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమల్ మండలాల నుంచి సుమారు 120 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పంటల వైవిధ్యీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, ప్రాజెక్ట్ కె-100 ద్వారా లభించే ప్రయోజనాలపై అవగాహన పొందారు.


