Friday, July 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా రక్తదాహం

అమెరికా రక్తదాహం

- Advertisement -

​​ఇరాన్ అహ్వాజ్ పిల్లల క్యాన్సర్ ఆస్పత్రిపై దాడి
​అప్రమత్తమైన టెహ్రాన్

​భారీగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు
ఇరాన్‌ సైనిక బ్యారక్స్‌పై జరిగిన దాడిలో ఏడుగురు మృతి
గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన టెహ్రాన్‌​

నవతెలంగాణ-జనరల్‌ డెస్క్‌
ట్రంప్ సేనలు ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయి. అంతే దీటుగా టెహ్రాన్ తిప్పికొడుతోంది. వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. ఐఆర్ జీసీ సేనలు అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్ లోని వంతెనలను యూఎస్ కూల్చేస్తోంది. జనావాసాలపై దాడిని ముమ్మరం చేసింది. తాజాగా అహ్వాజ్ లోని పిల్లల ఆస్పత్రిపై దాడికి దిగింది. దీంతో అప్రమత్తమైన ఇరాన్ సైన్యం పిల్లల క్యాన్సర్ ఆస్పత్రిని ముందుగానే ఖాళీ చేయించాల్సి వచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. భారీగా ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని చెప్పారు.

వణుకుతున్న పశ్చిమాసియా
దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా వణికిపోతోంది. ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా దాడులు చేయగా ఇరాన్‌ కూడా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్‌ నౌకాదళానికి, రివల్యూషనరీ గార్డులకు చెందిన కీలక స్థావరాలు ఉన్న ఓడరేవు పట్టణం బందర్‌ అబ్బాస్‌పై బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ అమెరికా దాడులు కొనసాగాయి. ఇరాన్‌ ఓడరేవులపై తాను విధించిన దిగ్బంధనాన్ని పట్టించుకోకుండా హార్ముజ్‌లో ప్రయాణిస్తూ ఇరాన్‌లోని ఖర్గ్‌ దీవి వైపు వెళుతున్న ఓ చమురు ట్యాంకర్‌పై అమెరికా వైమానిక దళం హెల్‌ఫైర్‌ క్షిపణులను (గగనతలం నుంచి భూమి పైకి ప్రయోగించేవి) ప్రయోగించింది. ఇవి చమురు ట్యాంకర్‌ చిమ్నీని తాకాయి. హెల్‌ఫైర్‌ క్షిపణి లేజర్‌ కిరణాలను అనుసరించి లక్ష్యాలను ఛేదిస్తుంది. తాజా దాడులలో తొలిసారిగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై కూడా అమెరికా గురి పెట్టింది. అహ్వాజ్‌లోని క్యాన్సర్‌ ఆస్పత్రి సమీప ప్రాంతాలపై క్షిపణులు పడ్డాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో రోగులు, వారి బంధువులు ప్రాణభయంతో పరుగులు తీశారు. బందర్‌ అబ్బాస్‌తో పాటు రస్క్‌, ఛాబహార్‌, అహ్వజ్‌, కొనారక్‌, సిరిక్‌, ఖెష్మ్‌ సహా పలు నగరాలలో పేలుళ్లు సంభవించాయి.

బాలిస్టిక్‌ క్షిపణుల తయారీకి, అంతరిక్ష కార్యక్రమానికి కేంద్రమైన సెమ్నమ్‌ రాష్ట్రంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఖెష్మ్‌, బందర్‌ ఇమామ్‌ ఖొమైనీ, బుషెహర్‌ సహా పలు దక్షిణ ప్రాంతాలలో సైతం పేలుడు శబ్దాలు వినిపించాయి. బుషెహర్‌లో పౌర అణు కేంద్రం ఉన్న విషయం తెలిసిందే. ఖెష్మ్‌లోని ఓ పారిశ్రామిక కేంద్రం దెబ్బతింది. టెహ్రాన్‌కు నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాన్‌దాబ్‌లో కనీసం రెండు పేలుళ్లు జరిగాయని ప్రెస్‌ టీవీ తెలిపింది. అమెరికా దాడులను ఎదుర్కోవడానికి టెహ్రాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్‌ క్రియాశీలకం చేసింది. అమెరికా దాడులు ఉధృతం కావడంతో హార్ముజ్‌లో ప్రయాణిస్తున్న నౌకలలో సిబ్బందిని ఉంచవద్దని ఇరాన్‌ ఆదేశాలు జారీ చేసింది. నౌకలలో పనిచేసే సిబ్బందిని సరఫరా చేసే దేశాలలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది భారతీయ నావికులు, సిబ్బంది, ఇంజినీర్లు నౌకలలో పని చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ హార్ముజ్‌లో ప్రయాణించే నౌకలలో భారతీయుల సేవలను ఉపయోగించుకోవద్దని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫిప్పింగ్‌ ఓ ప్రకటనలో ఆదేశించింది. గత మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా హార్ముజ్‌లో వ్యూహాత్మక ప్రదేశమైన గ్రేటర్‌ తన్బ్‌ దీవిలోని ఇరాన్‌ రక్షణ, క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దళాలు దాడి చేశాయి. సిస్తన్‌-బలూచిస్తాన్‌ రాష్ట్రంలో ఇరాన్‌ 388వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ బ్యారక్స్‌పై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో సైనికులు సహా ఏడుగురు చనిపోయారు.

చర్చల ఆలోచనే లేదు : ఇరాన్‌
అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించే ఆలోచన ఏదీ లేదని ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘై స్పష్టం చేశారు. అమెరికా సైనిక దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడం పైనే ప్రస్తుతం దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. అమెరికాతో కుదుర్చుకున్న ఎంఓయూకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని తెలిపారు. ఇరాన్‌ను చర్చల వేదిక వద్దకు రప్పించేందుకే దాడులు చేస్తున్నామంటూ అమెరికా చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఎంఓయూలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అమెరికా విఫలమైందని, అందుకే తామిచ్చిన హామీలపై పునరాలోచన చేస్తున్నామని చెప్పారు. ఎంఓయూ అమలుపై అమెరికాకు విశ్వాసం లేదని విమర్శించారు. తమ ప్రతిఘటన చర్యలకు ఇరాన్‌లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని అంటూ అమెరికా సైనిక చర్యకు తగిన విధంగా జవాబిచ్చేందుకు తమ సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని బాఘై తెలిపారు.

యూఎస్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా…
ఇరాన్‌ కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అమెరికా లక్ష్యాలపై దాడులు చేసింది. బV్‌ారైన్‌, కువైట్‌, జోర్డాన్‌పై విరుచుకుపడింది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, ఇంధన నిల్వ కేంద్రాలపై కామికజ్‌ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్‌ వైపు నుంచి వచ్చిన ఎనిమిది క్షిపణులను కూల్చేశామని జోర్డాన్‌ సైన్యం తెలిపింది. కువైట్‌, బV్‌ారైన్‌లోని అమెరికా స్థావరాలలో ఉన్న రాడార్‌, రక్షణ వ్యవస్థలపై ఇరాన్‌ దాడులు చేసింది. కువైట్‌లోని అలీ అల్‌ సలేం స్థావరంలో ఉన్న అమెరికా రాడార్‌ వ్యవస్థలు, పాట్రియాట్‌ రక్షణ వ్యవస్థలు, ఇంధన ట్యాంకులపై దాడులు జరిగాయి. ఇదే స్థావరంలోని సీ-రామ్‌ ముందస్తు హెచ్చరికల రాడార్‌ పైన, అమెరికా సైనికులు సమావేశమయ్యే ప్రదేశం పైన దాడి చేశామని రివల్యూషనరీ గార్డులు తెలిపారు.బహ్రెయిన్‌లో షేక్‌ ఇసా స్థావరంలోని కమ్యూనికేషన్‌-రాడార్‌ వ్యవస్థలు కూడా ఇరాన్‌ 
దాడికి గురయ్యాయి. తమ దేశంలోని మౌలిక సదుపాయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోనని, అమెరికా ప్రాంతీయ భాగస్వామ్య దేశాలలోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని ఇరాన్‌ హెచ్చరించింది. గల్ఫ్‌ ప్రాంతంలోని అన్ని మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్‌ సైనిక ప్రతినిధి ఇబ్రహిం జోల్ఫఘరీ చెప్పారు. హార్ముజ్‌ ఓ రెడ్‌ లైన్‌ అని, దానిలో అమెరికా జోక్యాన్ని ఎప్పటికీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -