జగదాంబమ్మకు తొలి బోనం సమర్పణ : పట్టువస్త్రాలు అందజేసిన మంత్రులు
కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సందర్శకులతో కిటకిటలాడిన గోల్కొండ కోట పరిసరాలు
అలరించిన పోతరాజుల విన్యాసాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ జీవన వైవిధ్యానికి, భక్తికి, ఐక్యతకు ప్రతీక అయిన ఆషాఢం బోనాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ జగదాంబమ్మకు తొలి బోనం సమర్పించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయ్యిదాల మధ్య గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారికి మంత్రులు పట్టువస్త్రాలు, బంగారు బోనాన్ని సమర్పించారు. ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్, ఫిషరీస్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఆలయ చైర్మెన్ ఆకుల చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి : మంత్రి కొండా సురేఖ
రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. తొలి(బంగారు) బోనం సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 1813 సంవత్సరంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలిన సమయంలో ప్రజలు అమ్మవారిని ప్రార్థించగా, వ్యాధి తగ్గుముఖం పట్టిందనీ.. అప్పటి నుంచి ఈ బోనాల ఉత్సవం వైభవంగా కొనసాగుతోందని గుర్తు చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించిందని, తెలంగాణను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఐక్యతకు నిదర్శనం బోనాలు
గోల్కొండ బోనాలకు ఘనమైన చరిత్ర ఉందని, ఇవి తెలంగాణ సంస్కృతికి, హిందూ-ముస్లింల ఐక్యతకు నిదర్శనమని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం విషయంలో పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. జంట నగరాల్లోని అన్ని దేవాలయాల్లోనూ బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులను మంజూరు చేశారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీసు శాఖ నిరంతరం నిఘా ఉంచి శాంతిభద్రతలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
పోతురాజుల విన్యాసాలు
జాతరలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను అబ్బురపరిచాయి. వేల సంఖ్యలో జనం తరలిరావడంతో గోల్కొండ కోట జనసంద్రమైంది. శివసత్తుల పూనకాలు, డప్పు దరువులతో కోట పరిసరాలు మారుమోగాయి.
పుస్తకావిష్కరణ – చెక్కు పంపిణీ
ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ‘బోనాలు’ పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం దేవస్థానానికి సంబంధించిన చెక్కును ఈవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, ఆర్డివో రామకృష్ణ, ఆలయ ఈవో వసంత, తహసిల్దార్ ప్రవీణ్, నయీముద్దీన్, విద్యుత్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్, పోలీస్, ఫైర్, రెవిన్యూ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.



