ఇరాన్ విదేశాంగ మాజీ మంత్రి,
ఎంపీ మనుచెహర్ మొత్తకి పిలుపు
టెహ్రాన్ : అమెరికా- ఇరాన్ తమ మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని పక్కకు బెట్టి మరీ భీకరదాడులకు పాల్పడుతున్నాయి. దీనికితోడు ఇరు దేశాల నేతలు సైతం చేస్తున్న వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో వంద మంది అమెరికా సైనికులను కిడ్నాప్ చేయాలని ఇరాన్ విదేశాంగ మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు మనుచెహర్ మొత్తకి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలను ఆక్రమించి.. బంధించిన సైనికుల్ని ఇరాన్ తీసుకురావాలని సైన్యానికి సూచించారు. అమెరికాతో అవగాహనా ఒప్పందం ఒక మోసపూరిత ప్రణాళికగా అభివర్ణించారు. ‘‘ఇస్లామాబాద్‌లో చర్చలు అంతా ఒక పథకం ప్రకారం అమెరికా పన్నిన కుట్ర. రెండూ మూడ్రోజుల్లో తమ ప్రణాళికను పూర్తిచేసి, ఇస్లామిక్ రిపబ్లిక్‌కు ముగింపు పలికేస్తామని భావించారు. కానీ పూర్తిగా విఫలమయ్యారు’’ అని ఆయన విమర్శలు చేశారు. ఇరాన్‌పై దాడి చేసినందుకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ఖర్గ్ ఐలాండ్‌ను సీజ్ చేస్తామని యూఎస్ హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మనుచెహర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.



