నల్లగొండలో 18 నుంచి 21 వరకు నిర్వహణ
రైతాంగ ఉద్యమానికి కొత్త దిశ
మహాసభ ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశంలో
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలకు చాటిచెప్పే లక్ష్యంతో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ మహాసభను నవంబర్ 18 నుంచి 21 వరకు నల్లగొండలో నిర్వహించనున్నట్టు ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ తెలిపారు. 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభ ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశాన్ని శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న లక్నోలో స్థాపించబడిన అఖిల భారత కిసాన్ సభ దేశంలో 90 ఏండ్లుగా రైతాంగ హక్కుల కోసం పోరాడుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పలాసా (1940), విజయవాడ (1944), ఖమ్మం, గుంటూరు (2010)లో నాలుగు జాతీయ మహాసభలు జరిగాయని, ప్రతి మహాసభ రైతాంగ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని చెప్పారు. పలాసా, విజయవాడ మహాసభలు బ్రిటిష్ పాలన, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేశాయని, ఖమ్మం మహాసభ ఆర్థిక సరళీకరణ విధానాల ప్రభావంపై దేశవ్యాప్తంగా చర్చకు నాంది పలికిందని వివరించారు.
గుంటూరు మహాసభలో ‘ఆత్మహత్య కాదు.. కలిసి పోరాడుదాం’ అనే నినాదంతో రైతు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించామని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వీర తెలంగాణ పోరాటానికి కేంద్రస్థానమైన నల్లగొండలోనే ఈసారి మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 ఏండ్లుగా అమలు చేస్తున్న విధానాల వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళా రైతులు, వలస కార్మికులు పెద్దఎత్తున ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల ద్వారా దిగుమతి సుంకాలు లేకుండా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ధాన్యాలు, పాల ఉత్పత్తులు దేశంలోకి వస్తే భారత రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం వెనక్కి తీసుకునేలా చేసిందని, ఆ ఉద్యమంలో 736 మంది రైతులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.
ఇప్పుడు అదే చట్టాలను పరోక్షంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం నిల్వ సౌకర్యాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా వ్యవసాయ రంగంలో గుత్తాధిపత్యానికి అవకాశం కల్పిస్తోందని తెలిపారు. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గాలు కలిసి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్తంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ఆగస్టు 10న సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్లు వెల్లడించారు. దాదాపు 10 లక్షల మంది రైతులు, కార్మికులు ఈ ఉద్యమంలో పాల్గొంటారని చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధం కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ పిలుపునిచ్చారు.
తొలుత హైదరా బాద్‌లో నిర్వహించాలని భావించిన మహాసభను వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర స్థానమైన నల్లగొండలో నిర్వహిం చాలని జాతీయ నాయకత్వం, ముఖ్యంగా జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్ పట్టుబట్టారని తెలిపారు. పరిమిత వసతులు ఉన్నప్పటికీ ప్రతినిధులందరూ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, మహాసభ విజయవంతం అందరి బాధ్యతని అన్నారు. పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం తొలగించడం, వంట -నూనెలు, ఆయిల్‌సీడ్స్‌పై సుంకాలను తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శిం చారు. విదేశీ దిగుమతులతో దేశీయ మార్కెట్లో ధరలు పడిపోయి రైతులు కనీస మద్దతు ధర కూడా పొందలేక పోతున్నారని చెప్పారు. ఈ నెల 29న ఢిల్లీలో రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సదస్సు దేశవ్యాప్త ఐక్య ఉద్యమాలకు నాంది పలుకుతుందని తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రైతు సంఘాల పోరాటాల ఫలితంగానే ఎక్స్‌గ్రేషియా, రైతుబంధు వంటి పథకాలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఎన్నికల హామీల మేరకు రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా అందడం లేదని, మొక్కజొన్న కొను గోళ్లలో కూడా ప్రభుత్వం విఫలమైం దని విమర్శించారు. వ్యవసాయం దెబ్బతింటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఉపాధి తీవ్రంగా ప్రభావితమ వుతుందని హెచ్చరించారు.
నల్లగొండ మహాసభ రైతాంగ పోరాటాలకు చారిత్రక వేదిక
నల్లగొండలో జాతీయ మహాసభ నిర్వహించడం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి చారిత్రాత్మక సందేశమని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అన్నారు. మహాసభ బాధ్యత నల్లగొండ జిల్లాదే కాకుండా తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబానిదని, రైతులు, ప్రజాసంఘాలు, మేధావులు, యువత స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్
ఉద్యమ బలోపేతానికి వినియోగించుకోవాలి
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభను కేవలం సంస్థాగత కార్యక్రమంగా కాకుండా, తెలంగాణలో రైతాంగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే చారిత్రాత్మక అవకాశంగా మలుచుకోవాలని ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికీ కిసాన్ సభ–ఇంటికొక రైతు, ఊరికొక బండి నినాదంతో రెండు లక్షల రైతు కుటుంబాలను కలవడంతో పాటు లక్ష మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. 100 రోజులపాటు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి రైతాంగ సమస్యలు, రైతు ఉద్యమాల చరిత్ర, పోరాటాల అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నల్లగొండ మహాసభ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందని, రైతులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేసి ఈ మహాసభను చారిత్రాత్మక విజయంగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు తుమ్మల వీరారెడ్డి, ఎండి జహంగీర్, కందాల ప్రమీల, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి, బొంతల చంద్రారెడ్డి, నున్న నాగేశ్వరరావు, అరిబండి ప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగరాజు శోభన్, నారి ఐలయ్య, డబ్బికార్ డమల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి



