Saturday, July 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌కు ఆధునిక రూపు

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌కు ఆధునిక రూపు

- Advertisement -

అమృత్ స్టేషన్‌ను వర్చువల్‌‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
నవతెలంగాణ-సిటీబ్యూరో

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన ‌హైదరాబాద్‌‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన మొత్తం 75 అమృత్ స్టేషన్లను జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జాతికి అంకితం చేశారు. ఇదే సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు రూ.25 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎవిఎన్‌.రెడ్డి మాట్లాడుతూ.. పన్నెండేండ్లలో దేశంలో రైల్వే రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణలో రూ.40 వేల కోట్లకు పైగా రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మధ్యతరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఆధునిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పునరాభివృద్ధి చేసినట్లు తెలిపారు. కొత్త స్టేషన్ భవనం, విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఆధునిక సైనేజీలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్టు వివరించారు. తెలంగాణలోని ఇతర అమృత్ స్టేషన్ల అభివృద్ధి పనులు కూడా నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, వేగవంతమైన విద్యుదీకరణ, ఆధునిక సౌకర్యాలతో రాష్ట్ర రైల్వే పరివర్తనలో కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో భాగంగా “నా నగరంలో అభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది?”, “అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి నేను ఏమి చేస్తాను?” అనే అంశాలపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీల విజేతలకు ప్రముఖులు బహుమతులు అందజేశారు. పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ అమృత్ స్టేషన్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఇతర పోటీల విజేతలను కూడా సన్మానించారు. అనంతరం సాంస్కృతిక, జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -