నవతెలంగాణ-డిచ్ పల్లి
గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఇందల్ వాయి గ్రామ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్ డి ఎఫ్) నిధుల కింద రూ.23 లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు, డిసిసి కార్యదర్శి మోత్కురి నవీన్ గౌడ్ నేతృత్వంలో సర్పంచ్ లోకాని గంగామణి గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందల్ వాయి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో మరిన్ని అర్హులకు ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఎస్‌డీఎఫ్ నిధుల కింద ముదిరాజ్ సంఘం అభివృద్ధికి రూ.5 లక్షలు, కుమ్మరి సంఘానికి రూ.5 లక్షలు, ఇందల్ వాయి గ్రామంలోని పురాతనమైన శ్రీ రామాలయం ప్రాంగణంలో కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ నిర్మాణానికి రూ.10 లక్షలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, దేవాలయాలు, సామాజిక భవనాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సహకార సొసైటీ చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి,గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్, సభ్యులు, మాజీ సోసైటి చైర్మన్ మోచ్చ గోపాల్, ముదిరాజ్, కుమ్మరి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



