కేసీఆర్ నాయకత్వం కోసం తెలంగాణ ప్రజల ఎదురుచూపు
మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
నవతెలంగాణ – అమీన్‌పూర్
అమీన్‌పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలో గులాబీ శ్రేణులు కదం తొక్కాయి. చీమల బార్లు తీరినట్లుగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి అమీన్‌పూర్ ప్రాంతాన్ని గులాబీ మయం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిష్టాత్మక యువ సంగ్రామం సదస్సుకు పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు మేరకు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్‌లతో తరలివెళ్లాయి. శనివారం ఉదయం నుంచే అమీన్‌పూర్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణుల కోలాహలం నెలకొంది. జిహెచ్ఎంసి పరిధిలోని అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల నుంచి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభమైన భారీ వాహనాల ర్యాలీ కాన్వాయ్‌ను మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గులాబీ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ అంతటా పార్టీ శ్రేణుల నినాదాలతో అమీన్‌పూర్ మార్మోగింది.
రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: తుమ్మల
ఈ సందర్భంగా తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమీన్‌పూర్, బీరంగూడ కార్పొరేటర్ల స్థానాన్ని గులాబీ ఖాతాలో వేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం చెక్కుచెదరలేదని, కార్యకర్తల ఉత్సాహమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. “ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇటు సామాన్యులు, అటు రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.” అని తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని తుమ్మల స్పష్టం చేశారు. మళ్లీ తెలంగాణలో అభివృద్ధి పండగ జరగాలన్నా, ప్రజా సంక్షేమం వర్ధిల్లాలన్నా గులాబీ బాస్ కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని.. ఆయనకు తిరిగి పట్టంకట్టేందుకు తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య నేతలు, వార్డు ప్రతినిధులు, యువజన విభాగం నాయకులు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, టిపిఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.



