నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో ఆదివారం శ్రీ రంగనాయక ఆలయం వద్ద ప్రారంభమైన జగన్నాథ రథయాత్రను, రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూరి జగన్నాథ యాత్ర మాదిరిగా, ఆలేరు పట్టణంలో సైతం జగన్నాథ రథయాత్రను భక్తులు చేపట్టడం హర్షనీయమన్నారు. శ్రీ రంగనాయక ఆలయం నుండి లోని పురవీధుల గుండా శ్రీ రంగనాథుని ఊరేగిస్తూ శ్రీ కనకదుర్గ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.
అర్చకులు మంగళగిరి శేషగిరి, మంగళగిరి వరదరాజులు అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాధుని రథాన్ని పూలతో అందంగా అలంకరించారు. జై జగన్నాథ అంటూ భక్తులు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిజన బాలమణి భాస్కర్, పిఎసిహెచ్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, స్థానికులు బండి రాజుల శంకర్, ఆలయ కమిటీ సభ్యులు కౌన్సిలర్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



