జర్నలిస్టులపై దాడి కేసులో 307 సెక్షన్ నమోదు చేయాలి
జిల్లా జర్నలిస్టుల ధర్నా విజయవంతం
సీఐ హామీతో విరమణ
నవతెలంగాణ-మక్తల్ / కృష్
కృష్ణా మండలం వాసునగర్‌లో ఈ నెల 18న నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాము, కెమెరామెన్ తాహెర్‌పై జరిగిన దాడి ఘటనలో నిందితులపై హత్యాయత్నం (307) సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో టైరోడ్ వద్ద నిర్వహించిన ధర్నాకు అఖిలపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. అనంతరం సీఐ రామ్‌లాల్ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
జిల్లా జర్నలిస్టుల నాయకుడు ఆనంద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే పాత్రికేయులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు న్యాయం జరగకపోతే దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇసుక మాఫియా అరాచకాలను తీవ్రంగా ఖండించారు. కర్ణాటక గుండాలను తీసుకొచ్చి జర్నలిస్టులపై దాడులు చేయించడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోమని, పోలీసు వ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 307 సెక్షన్ నమోదు చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సీపీఎం మక్తల్ నియోజకవర్గ కార్యదర్శి పుంజనూరు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.అఖిలపక్ష నాయకులు ముక్తకంఠంతో జర్నలిస్టులకు అండగా ఉంటామని ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని, పాత్రికేయుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు శివశంకర్, నవీన్ కుమార్, నారాయణ, గురుప్రసాద్, బీఆర్‌ఎస్ నాయకులు నరసింహులు గౌడ్, బీజేపీ కృష్ణ మండల అధ్యక్షుడు నల్లే నరసప్ప, అమర్ దీక్షిత్, అశోక్ గౌడ్, కనకరాజు, మాజీ సర్పంచ్ సిద్ధప్ప, శివరాజ్ పాటిల్, నరసింహారెడ్డి, సీపీఎం నాయకులు భరత్ కుమార్, పుంజనూరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



