– మండల విద్యాశాఖ అధికారి ఎస్. రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్
ఉపాధ్యాయులు సమీకృత ఇన్ సర్వీస్ శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు చేయాలని మండల విద్యాశాఖ అధికారి ఎస్. రాజగోపాల్ రెడ్డి అన్నారు.సోమవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్‌లో ప్రారంభమైన మూడు రోజుల మండల స్థాయి సమీకృత ఇన్-సర్వీస్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎస్. రాజగోపాల్ రెడ్డి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న నూతన బోధన పద్ధతులు, వినూత్న అభ్యసన విధానాలను ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని కోరారు.
శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను ఆచరణలో పెట్టినప్పుడే ఈ కార్యక్రమం ఉద్దేశం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణను సద్వినియోగం చేసుకొని పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.శిక్షణకు ప్రతిరోజు సమయానికి హాజరై మూడు రోజులపాటు పూర్తిస్థాయిలో పాల్గొనాలని, శిక్షకులు నిర్వహించే కార్యాచరణలు, గ్రూప్ వర్క్, చర్చల్లో చురుకుగా పాల్గొనాలని తెలిపారు.అలాగే, శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా పద్ధతులను పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని, తక్కువ వ్యయంతో బోధనోపకరణాలు తయారు చేసి విద్యార్థులకు ఆసక్తికరంగా బోధన అందించాలని సూచించారు. నాణ్యమైన విద్య అందించడం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని, పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలు మరింత మెరుగుపడి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు దోహదపడుతుందని ఎంఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నాగరాజు, రిసోర్స్ పర్సన్లు కనకారెడ్డి, చంద్రశేఖర్, రాజు, సాజిత్, సీఆర్‌పీలు స్వామిగౌడ్, యాదగిరి, ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



