ఆహార ధాన్యాల ప్రజా పంపిణీలో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థ కొంతకాలంగా భారతదేశంలో నడుస్తోంది. ఆ వ్యవస్థలో ఒక కీలకమైనది అంత్యోదయ అన్న యోజన (ఎ.ఎ.వై). ఇది గ్రామాల్లో 75 శాతం జనాభాకు, పట్టణాల్లో యాభై శాతం జనాభాకు వర్తిస్తుంది. ఈ పథకం వలన లబ్ధి పొందే అర్హతగల ప్రతీ కుటుంబానికి నెలనెలా 35 కిలోల ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు అందిస్తారు. ఇది కాక అదనంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పి.ఎం.జి.కె.ఎ.వై) కింద ప్రతీ వ్యక్తికి అదనంగా ఐదు కిలోలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఈ పథకం 2023 జనవరి ఒకటో తేదీ నుండి అమలులోకి వచ్చింది. 2028 డిసెంబర్ 31తో ఈ రెండవ పథకం ముగియనుంది. ఈ పథకాలు నడుస్తున్నప్పటికీ, జనాభా తలసరి ఆహార వినియోగం గత కొన్నేళ్ళుగా తగ్గిపోతూ వస్తోంది. అందువలన ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం మొత్తం 115 దేశాలకు గాను వంద కన్నా తర్వాత స్థానాల్లోనే ఉంటోంది. ఇటువంటి పరిస్థితిలో మోడీ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న పథకానికి కూడా కోతలు పెట్టడానికి తయారవడం విడ్డూరం! కేవలం ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించు కోవడం, తద్వారా ద్రవ్యలోటు తగ్గించుకుని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని సంతృప్తి పరచడమే ఈ కోత వెనుక కారణం.
జాతీయ ఆహార భద్రతా చట్టానికి (ఎన్.ఎఫ్.ఎస్.ఎ) అనుగుణంగా ఎ.ఎ.వై అమలౌతోంది. ఈ చట్టానికి ఇప్పుడు తీసుకురానున్న సవరణలో తలకు ఏడు కిలోలకు మించకుండా కుటుంబానికి 35 కిలోలకు మించ కుండా నెలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని మార్పు ప్రతిపాదిస్తున్నారు. దీనివలన సగటున ఒక కుటుంబానికి పంపిణీ అయ్యే మొత్తం తగ్గిపోతుంది. ఒక కుటుంబంలో అయిదుగురి కన్నా తక్కువ మంది ఉంటే ఆ కుటుంబానికి ఆ మేరకు తక్కువ పంపిణీ అవుతుంది. పోనీ, అక్కడ తగ్గించిన దాన్ని అయిదుగురి కన్నా ఎక్కువమంది సభ్యులు ఉన్న కుటుంబాలకు మళ్లిస్తారా అంటే అటువంటిదేమీ లేదు. అందుచేత ఈ సవరణ ఫలితంగా మొత్తంగా చూసినప్పుడు పంపిణీ అయ్యే ఆహారధాన్యాల పరిమాణం తగ్గిపోతుంది.
ఈ సవరణపై ఒక విషయంలో చాలా విమర్శ వచ్చింది. ఆ విమర్శ సరైనదే. జనాభా పెరుగుదలను జయప్రదంగా నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఈ సవరణ ద్వారా శిక్ష విధిస్తున్నారన్నదే ఆ విమర్శ. జనాభాను నియంత్రించి నందున ఈ రాష్ట్రాల్లో కుటుంబాల్లో అయిదుగురికన్నా తక్కువ మంది ఉండే అవకా శాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఇంతవరకూ కుటుంబానికి నెలకు 35 కిలోల వంతున పొందుతున్నది కాస్తా ఇకపైన తగ్గిపోనుంది. అందుకే ఈ రెండు రాష్ట్రాలూ ఈ చట్ట సవరణను వ్యతిరేకించడంలో తక్కిన రాష్ట్రాలకన్నా ముందున్నాయి.
ఇప్పుడు కేంద్రం ద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నది ఎక్కువ ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాల పట్ల మాత్రమే కాదు. మొత్తం దేశంలో ఉన్న పేదలందరి పట్లా కూడా అదే తీరుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న ట్టుగానే నెలకు 35 కిలోల చొప్పున అన్ని కుటుంబాలకూ పంపిణీని కొసాగించినా, అప్పటికీ, పౌష్టికాహార లభ్యత కనీస స్థాయిలో కూడా ఉండదు. ఒకానొక రాష్ట్రం జయప్రదంగా జనాభా నియంత్రణను సాధించింద నుకుందాం. అప్పుడు ఆ రాష్ట్రంలో జనాభా స్థిరంగా కొనసాగుతుంది. అంటే ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు సగటున ఉంటారు. అంటే నలుగురు. ఇక అంతగా జనాభా నియంత్రణలో విజయం సాధించ లేకపోయిన రాష్ట్రం తీసుకుంటే అక్కడ కుటుంబం సైజు కూడా కనీసం నలుగురైనా ఉంటారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, జాతీయ పౌష్టికాహార సంస్థ అనుదినం తీసుకోవలసిన పౌష్టికాహా రానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చి వున్నాయి. వయస్సు, జెండర్, చేసే పని స్వభావం బట్టి ఆ మార్గ దర్శకాలు ఉన్నాయి. వాటిలో పేర్కొన్న ప్రమాణాలు ఒక ‘‘ఆదర్శవంతమైన పరిస్థితి’’ లో అమలు జరిగేవి తప్ప ఇప్పుడు కాదు. అందుచేత అంచనా కోసం మనం ఒక సరళమైన పద్ధతిని అనుసరిద్దాం.
గతంలో ప్రణాళికా సంఘం పేదరికం అంటే కనీస శక్తిని ఇచ్చే ఆహారాన్ని కూడా పొందలేని స్థితి అని నిర్వచించింది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతంలో రోజుకు ప్రతీ ఒక్కరు 2200 కేలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని పొందగలిగితే వారు పేదరికంలో లేనట్టే. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీలు పొందగలిగితే వారు పేదరికంలో లేనట్టు పరిగణించబడతారు. అంతకన్నా తక్కువ శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే పొందగలుగుతున్న వారు పేదలు అని లెక్క. మన దేశంలో పేద కుటుంబాల్లో ప్రతీరోజూ తీసుకునే ఆహారం నుండి పొందే శక్తి లో ఎనభై శాతం ఆహార ధాన్యాల నుండే వస్తుంది. ఒక గ్రాము బియ్యం గాని, గోధుమ గాని 3.5 కేలరీల శక్తిని ఇస్తాయి. ఆ లెక్కన కనీస శక్తిని పొందాలంటే గ్రామాల్లో రోజుకు 502 గ్రాములు, పట్టణాల్లో 479 గ్రాములు అవసరమౌతాయి. లెక్క సౌలభ్యం కోసం వాటిని 500 (గ్రామాలకు) , 480 (పట్టణాలకు) సవరిద్దాం. అప్పుడు నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి నెలకు గ్రామాల్లో 60 కిలోలు, పట్టణాల్లో 57.6 కిలోలు ఆహారధాన్యాలు కనీసం అవసరం.
ప్రస్తుతం అంత్యోదయ కింద ఇస్తున్న 35 కిలోలను, ప్రధాని గరీబ్ యోజన కింద ఇస్తున్న ఇరవై కిలోలను కలిపి లెక్కించినా, అది 55 కిలోలే అవుతోంది. అంటే అధికా రికంగా నిర్ణయించిన కనీస పౌష్టికాహార ప్రమాణా లకన్నా కూడా తక్కువగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పాదిస్తున్న మార్పు ఫలితంగా నలుగురుండే కుటుం బానికి ఇప్పుడు లభిస్తున్న 35 కిలోలకు బదులు 28 కిలోలే వస్తాయి. దానికి ప్రధాని పథకం కింద వచ్చేవి కలిపితే అప్పుడు 48 కిలోలే అవుతాయి. అంటే ఈ కోత వలన గ్రామీణ ప్రాంతాల్లో కనీస స్థాయికన్నా ఇరవై శాతం దిగువకు, పట్టణ ప్రాంతాల్లో 16.7 శాతం దిగువకు ఆహారధాన్యాల లభ్యత పడిపోనుంది.
ఒకవేళ ఇప్పటివరకూ అందిస్తున్నది కనీస స్థాయికన్నా ఎక్కువగా వుండి వుంటే, అప్పుడు ఈ కోత ప్రతిపాదనను కొంతైనా అర్థం చేసుకోవచ్చు. కాని ఇప్పుడు ఇస్తున్నదే కనీస స్థాయి కన్నా తక్కువగా ఉన్నప్పుడు దానిని మరింత తగ్గించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పైగా, ప్రధాని గరీబ్ యోజన ను కరోనా కాలంలో ఒక అత్యవసర చర్యగా ప్రవేశపెట్టారు. అది 2028 డిసెంబర్ 31తో ముగిసిపోనుంది. ఇప్పుడు ఆహార భద్రత చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ కోతకు పూనుకుంటున్న ప్రభుత్వం ప్రధాని గరీబ్ యోజన పథకాన్ని 2028 తర్వాత కూడా కొనసాగించే ప్రతిపాదనను కాని, దానిని ఒక శాశ్వత పథకంగా మార్చే ప్రతిపాదన కాని ఏదీ చేయలేదు. అంటే 2028 తర్వాత ఆ పథకం ఆగిపోయి పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుంది.
మరి ఇటువంటి కోతకు ప్రభుత్వం ఎందుకు పూనుకుం టోంది? అమెరికా-ఇండియా వాణిజ్య ఒప్పందం ప్రకారం భారతదేశం తన ఆహార స్వయం సమృద్ధిని నిలబెట్టుకోవడం కన్నా ఆహార ధాన్యాల దిగుమతుల మీదే ఎక్కువగా ఆధారపడవలసి వుంటుంది. అప్పుడు ప్రభుత్వం ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థను కొనసాగించ గలుగుతుందా? అన్నది పెద్ద ప్రశ్న. అందుచేత ముందు నుంచే క్రమంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమంగా కుదించివేసే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో దీన్ని ఎత్తివేసేందుకు ముందు నుంచే రంగాన్ని సిద్ధం చేస్తోంది.
అంతేకాక, మరొక తక్షణ కారణం కూడా ఉంది. ఇప్పుడు ఎఫ్.ఆర్.బి.ఎం చట్టం ప్రకారం ప్రభుత్వం బడ్జెట్‌లో ద్రవ్య లోటును ఎట్టి పరిస్థితిలోనూ పరిమితి దాటనివ్వకూడదు. మరి ప్రపంచంలో ముడిచమురు ధరలు బాగా పెరిగిపోవడంతో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు ఎక్కువ అవుతున్నాయి. ఆ భారాన్ని సర్దుబాటు చేయడానికి సంపన్నుల మీద అదనపు సుంకాలను విధించ వచ్చు. కాని ఆ పని చేసే బదులు, ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకునే పనిలో బిజీగా ఉంది. ఉదాహరణకి ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇచ్చే గ్రాంట్లలో కోతలు పెట్టింది. అదే మార్గంలో ఇప్పుడు ‘అంత్యోదయ’కు కోతలు ప్రతిపాదిస్తోంది. నయా ఉదారవాద పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇప్పుడు మన భారతదేశం కన్నా సరైన ఉదాహరణ మరొకటి లేదు.
ప్రభాత్ పట్నాయక్
పేదల కడుపులు మాడ్చేది ద్రవ్య పెట్టుబడిని సంతృప్తి పరచడం కోసమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



