తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి
ఆరుతడి పంటలపై రైతులకు
అవగాహన కల్పించాలి
ఉమ్మడి జిల్లాల సమీక్షలో మంత్రులు
నవతెలంగాణ-మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధులు
ఎల్‌నినో ఒక సహజ ప్రకృతి విపత్తు అని, ఆ ప్రభావం కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలూ ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి.. నీటి వనరులను పొదుపుగా వినియోగించాలని సూచించారు. తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలపై సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా పలు చోట్ల మంత్రులు సమీక్షలు చేశారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు
ఎల్‌నినో ప్రభావాన్ని అడ్డుకోవడం సాధ్యం కాకపోయినా, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ యంత్రాంగం సమర్థతపై ఆధారపడి ఉందని ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షలో మంత్రులు అన్నారు. తాగునీరు, విద్యుత్, సాగునీరు, వ్యవసాయ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యాచరణతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించడంతో పాటు ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలు, వ్యవసాయం, ఉద్యానవనం తదితర శాఖలు సమన్వయంతో గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ‘సూపర్ ఎల్‌నినో’ పరిస్థితులు నెలకొనే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీరు ప్రధానంగా తాగునీటికే సరిపోతుందని, వర్షాలు లేకపోతే వచ్చే జులై వరకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రైతులు వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలవైపు మళ్లాలని, పంట మార్పిడిపై అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి, దున్నపోతులగండి, బస్వాపూర్ పనులను వేగవంతం చేస్తామని, దేవాదుల ఫేజ్-6 ద్వారా తుంగతుర్తికి గోదావరి జలాలు అందిస్తామని వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా గ్రామాల్లోనే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. తాగునీటి అవసరాలను దష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులు, కాలువల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ అంశాలపై ఎమ్మెల్యేలు మంత్రులకు విన్నవించారు.
సంగారెడ్డి కలెక్టరేట్‌లో..
సంగారెడ్డి, మెదక్ జిల్లాల సమీక్ష సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం, నీటి కొరత, పంటలపై ప్రతికూల ప్రభావం వంటి పరిస్థితులను అంచనా వేయాలన్నారు. శాఖల వారీ కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి
ఆరుతడి పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా సమీక్ష నిర్వహించారు. ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి, వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు ధైర్యం, భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జులై 31 నాటికి శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్, ఎల్‌నినో ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మెన్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
భూగర్భ జలాల పరిరక్షణకు ప్రజాఉద్యమం
భూగర్భ జలాల పరిరక్షణను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ జిల్లాలో 42 శాతం లోటు వర్షపాతం నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా స్థాయి కంటింజెన్సీ సమీక్ష ప్రజాభవన్‌లో జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సాంస్కతిక శాఖ కళాబందాలతో కళాప్రదర్శనలు నిర్వహించి నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల నివాసాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
సమర్థవంతంగా ఎదుర్కోవాలి : భట్టి
ఎల్‌నినో ప్రభావాన్ని శాస్త్రీయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, శాఖల సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతం, తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వర్షపాతం లోటు, నీటి లభ్యతపై ప్రతి రైతుకూ స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. జులై 15 నాటికి ఉమ్మడి జిల్లాలో 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని అధికారులు వివరించారు. భూగర్భ జలాలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి అధిక అవసరమున్న వరి వంటి పంటల సాగుకు దూరంగా ఉండాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను జిల్లా అవసరాలకు వినియోగించే అవకాశాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎల్‌నినో సహజ ప్రకృతి విపత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



