Sunday, March 15, 2026
E-PAPER
Homeకవిత'సృజన' కు తొలిమెట్టు పాఠశాల

‘సృజన’ కు తొలిమెట్టు పాఠశాల

- Advertisement -


పాఠశాల స్థాయి పిల్లలు కవిత్వం రాస్తే అది గేయరూపంలోనో, ప్రాసను అనుసరిస్తూనో వుంటదనే అభిప్రాయాల్ని సవరించుకోవాల్సిన అవసరం వుంది. ‘వచన కవిత’ ను అర్థం చేసుకోవడం, రాయడం సాధన చేస్తున్న భవిష్యత్‌ తరం కవుల కషిని మెచ్చుకోవాలి, ప్రోత్సహించాలి. బడిపిల్లల కవిత్వాన్ని మెరుగు పరుస్తున్న ఉపాధ్యాయులకు కతజ్ఞతలు చెప్పితీరాలి. సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి దారులు పరుస్తున్న విధానం ఎన్నదగినది. చిన్నారి ‘కొమ్ము పల్లవి’ జెడ్‌పిహెచ్‌ఎస్‌ దాట్ల పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. చదువుతోపాటు సృజన ప్రక్రియ అయిన కవిత్వం లోనూ తన ప్రతిభను చూపిస్తుంది. పల్లవి రాసిన ‘పున్నమిచంద్రుడు’ కవిత గురించి మాట్లాడుకుందాం.

పల్లవి అనుసరించిన నిర్మాణ క్రమం, వ్యూహం బాగుంది. శీర్షికతో సహ ఎత్తుగడ నుండి ముగింపు వరకు ఎక్కడా ‘వస్తువు’ వాచ్యంగా కనిపించదు. భావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పాఠకులు సులభంగానే ‘వస్తువు’ ను పసిగట్టగలుగుతరు. కవిత్వ వాక్యాల ద్వారానే వస్తువును ధ్వనింపజేయడం ఈ కవితలోని ప్రత్యేకత. శీర్షిక ప్రతిబింబించే ఆ ‘పున్నమి చంద్రుడు’ ఎవరై వుంటారో ‘మొదటి హీరో, మొదటి నవ్వు, మొదటి అడుగు’ వంటి అలతి అలతి పదాల ద్వారా గ్రహిస్తాం. ‘దేవుడిచ్చిన వరం కాదు నువ్వు, నువ్వే మా దేవుడివి’ అనే ముగింపు ద్వారా ‘శీర్షిక’ ను ఉన్నతంగా నిల్పి వుంచే ప్రయత్నం జరిగిందని చెప్పవచ్చు. ‘ప్రేమనదిలా ఉప్పొంగి కళ్ళు కన్నీటి వరదలు అవడంలో, చిన్న సంచిలో పండ్లతో పాటు ప్రేమను నింపుకుని రావడంలో, హాస్టల్‌ గేటు దగ్గర చూసినపుడు గుండె మరింత వేగంగా కొట్టుకోవడంలో’ అనుభూతించే ఉద్వేగ పరంపర మనసును తడి చేస్తుంది. హోమ్‌ సిక్‌ స్థితిని; కూతురికి తండ్రిపట్ల, తండ్రికి కూతురు పట్ల వుండే అనురాగాన్ని తెలియజేస్తది.
నాన్న లేడనే విషయాన్ని నేరుగా చెప్పకుండా ‘పున్నమి చంద్రుడి లాంటి నీ నవ్వును అమావాస్య ఎత్తుకుపోయినా ‘ అనే ప్రతీకాత్మక కవిత్వ వాక్యం ద్వారా ధ్వనింపజేయడం గమనించవచ్చు. లేని, ఖాళీతనాన్ని ‘దూరంగా వున్నా హదయంలోనే వున్నట్టు, అడుగుల సడి చెవికి వినిపిస్తున్నట్టు, తన ప్రేమ చుట్టూ తిరుగుతూనే వుందని చెప్పడం వంటివి ‘ఎత్తుగడ’ను వెలిగించిన వాక్యాలుగా చెప్పవచ్చు. బలమైన వ్యక్తీకరణలు కవిత్వగాఢతను పెంచుతయి. ‘బాగా చదవాలి భవిష్యత్తు వెలగాలి’ వంటి వాక్యాలు పల్లవి వంటి అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తినింపుతయి. నాన్నను పల్లవి ఎలా చూడగలిగిందనే విషయం తన దృష్టికోణాన్ని చూపెడుతది. ‘నడకలో ధైర్యం, కళ్ళల్లో విశ్వాసం, మౌనంలో అపారమైన ప్రేమను చూడగలగడం ఉన్నతమైన ఆలోచనల్ని కల్గివున్నప్పుడే సాధ్యం అయి తయి. ఒకరకంగా తన నాన్న వ్యక్తిత్వాన్ని నాస్టాల్జియా రూపంలో మన ముందుంచుతది.
ఆగామి కాలంలో అద్భుతమైన రచనలు చేయగలదని, సృజనాత్మక రచయిత్రిగా కొనసాగగలదని విశ్వసిస్తూ శుభాకాంక్షలు.– బండారి రాజ్‌ కుమార్‌, 8919556560

పున్నమి చంద్రుడు
నువ్వు దూరంగా వున్నా
నా హదయంలోనే వున్నావు
నీ అడుగుల సడి నా చెవికి వినిపిస్తూనే వుంది
నీ ప్రేమ నా చుట్టూ తిరుగుతూనే వుంది
నీ నడకలో ధైర్యం
కళ్ళల్లో విశ్వాసం
మౌనంలో అపారమైన
ప్రేమ వుంది
నన్ను బడిలో దింపి
‘బాగా చదవాలి భవిష్యత్తు వెలగాలి’ అన్నమాట
నా మనసులో నిలిచిపోయింది
హాస్టల్‌ గేటు దగ్గర నిన్ను చూసి
నా గుండె మరింత వేగంగా కొట్టుకునేది
చిన్న సంచిలో పండ్లతో పాటు
ప్రేమను నింపుకొని తెచ్చి
ఎట్లున్నవు బిడ్డా….అన్న
నీ స్వరం వినగానే
ప్రేమ నదిలా ఉప్పొంగి
కళ్ళు కన్నీటి వరదలు అయ్యేవి
దుఃఖాన్ని అదుముకుని
నా కన్నీళ్లు తుడిచి
గుండెలకు హత్తుకునే
పున్నమి చంద్రుడి లాంటి నీ నవ్వును
అమావాస్య ఎత్తుకుపోయినా..
నువ్వు చూపిన మార్గంలోనే నడుస్తున్న
నువ్విచ్చిన బలంతోనే నిలుస్తున్న
నేను చూసిన మొదటి హీరో నువ్వే
నా మొదటి నవ్వుకు కారణం నువ్వే
నా మొదటి అడుగుకు ఊతం నువ్వే
నా ధైర్యం దైవం మార్గం గమ్యం అన్నీ నువ్వే
నీ పిలుపు నా గుండెకు
నీ తలపు నా మనసుకు తెలుసు
నేను నీ ప్రతిరూపం
నా ప్రతి విజయం నీ ఆశీర్వాదం
దేవుడిచ్చిన వరం కాదు నువ్వు
నువ్వే మా దేవుడివి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -