వర్షాల్లేక జలశయాలు, భూగర్భజలాల్లో తగ్గిన నీటి నిల్వలు
తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు
తల్లడిల్లుతున్న మెజారిటీ గ్రామాలు
పంటల సాగు పరిస్థితులను పరిశీలించిన నవతెలంగా
నవతెలంగాణ- ప్రాంతీయ ప్రతినిధులు, విలేకరులు
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవ కపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఎగువ నుంచి వరదల ప్రవాహం లేకపోవడంతో భారీ ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు, చిన్న జలశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికారణంగా రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వరి, పత్తి, మొక్కజొన్న సాగు పనులు నెమ్మదించాయి. వర్షాభావ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలే రుజువు చేస్తున్నాయి. 12,760 గ్రామాలకు గాను 11,479 గ్రామాలు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వ తాజా నివేదికలోనే వెల్లడైంది. 29 జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 892 గ్రామాలు అత్యంత తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొం టున్నాయి. వ్యవసాయంతో పాటు తాగునీటి వనరులు, గ్రామీణ జీవన విధానం, స్థానిక ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 1,32,38,446 ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 59,83,971 ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. ఇంకా సాగు కావాల్సిన దాంట్లో అత్యధిక పంటలు వర్షాధార మీద ఆధారపడినవే ఉన్నాయి. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నా వాటిమీద రైతులు ఆశపెట్టుకోవడం లేదు. భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటిదాకా విత్తనాలు వేయడానికి రైతులు జంకుతున్నారు. మరోవైపు తాగునీటి ఇబ్బందులు నెలకొన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ర్టంలో పంటల సాగుపై నవతెలంగాణ బృందం పరిశీలించి నప్పుడు ఎల్ నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణను వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఉమ్మడి నల్లగొండలో ప్రతికూల పరిస్థితులు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా (నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి)లో వానాకాలం సీజన్‌లో మొత్తం 22.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ధారించింది. ఇందులో నాగార్జునసాగర్, మూసీ తదితర నీటి వనరుల కింద సుమారు 9.30 లక్షల ఎకరాల ఆయకట్టు, బోర్లు, బావుల ఆధారంగా మరో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితులు ఈ లక్ష్యాలకు గండికొడుతున్నాయి. జులై మధ్య నాటికి మొత్తం సాగు విస్తీర్ణంలో కేవలం 25–30 శాతం మాత్రమే సాగు పూర్తైంది. ముఖ్యంగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 25 శాతం కూడా సాగు దాటకపోవడం రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది.
అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నా.. ఏ మేరకు ప్రయోజనం…
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల రెండురోజులుగా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరిగా వుండడంతో ఈ వర్షాలు పంటలకు ఏ మేరకు ప్రయోజనకరంగా వుంటాయన్నది చెప్పడం కష్టమే. మహబూబాబాద్ జిల్లాలో జూలై 16 నాటికి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,40,583 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నమోదయ్యాయి. వరి సాగు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. వరి సాధారణ విస్తీర్ణం 2,18,557 ఎకరాలు కాగా, ప్రస్తుతం 17,787 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 80 శాతం చెరువులు పూర్తిస్థాయిలో ఎండిపోయి, మైదానాలుగా దర్శనమిస్తున్నాయి. జయశంకర్-భూపాలపల్లి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో సాగు పనులు మొదలు పెట్టిన రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జనగామ జిల్లాలో 753 చెరువుల్లో 25 శాతం కన్నా తక్కువ నీరు మాత్రమే ఉంది.
ప్రశ్నార్థకం పంటలు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగు వర్షాలు లేక ప్రశ్నార్థకంగా మారింది. అత్యధికంగా మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో సాగయ్యే వరి నార్లుమళ్లు 50 శాతం కూడా వేయలేదు. వర్షాధారిత పంటలు పండించే రైతులు మూడోసారి విత్తనాలు వేసుకునే పరిస్థితులు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జులై 15 వచ్చినా పత్తి, సోయా విత్తనాలు మొలకెత్తలేదు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, బేల, తాంసి మండలాల్లో ఈ రెండు రోజుల్లో వర్షాలు కురువకపోతే 50 శాతానికి పైగా రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ఏ పంటలు సాగు చేయాలన్నా వర్షాలే..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం రోజురోజుకూ స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఈ సమయానికి కురవాల్సిన వర్షాలు దాదాపు 15 రోజులుగా ముఖం చాటేశాయి. సంగారెడ్డి వ్యవసాయాధారమైన జిల్లా. నల్లరేగడి భూములు అధికంగా ఉన్న జిల్లా. ఏ పంటలు సాగు చేయాలన్నా వర్షాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అయితే జూన్ నెలలో అధికంగా 39శాతం వర్షం కురవడంతో ఇప్పటి వరకు పంటలకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. 15 రోజుల్లో వర్షాలు కురవకపోతే జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో దాదాపు 17 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
ప్రోత్సాహం కల్పిస్తే ఇతర పంటలకు సిద్ధం ..
ఇతర పంటల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తే వరికి బదులు వేరే పంటలు వేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రైతులు అంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధపడకపోగా , మాటలతో కాలయాపన చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. మార్కెటింగ్ సౌకర్యం, ప్రభుత్వం ప్రోత్సాహంగా బోనస్ ప్రకటిస్తే ఎలాంటి పంటలు పండించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్టు రైతులు చెబుతున్నారు.
అప్పులతో బోర్లు…
పెద్దవూర మండలంలోని బట్టుగూడెం, పులిచర్ల, ఉట్లపల్లి, బసిరెడ్డిపల్లి, బోనూతల, కుంకుడు చెట్టు తండా,పర్వేదుల,సంగారం,పోతునూరు,చలకుర్తి,పెద్దవూర గ్రామాల్లో వర్షాలు పడక, భూగర్భజలాలు అడు గంట్టాయి. నారు ఎండిపోకుండా కాపాడు కోవడం కోసం, అధిక వడ్డీలకు అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నారు. వేసిన ప్రతిచోటా నీరు పడక, పడ్డా ఎక్కువ కాలం పోయకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. బోర్లు వేయడానికి, మోటార్లు అమర్చడానికి రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతుండడంతో రైతులు ప్రయివేట్ అప్పులపాలవుతున్నారు.
ఒక్క భారీ వర్షం కురవకపోదా…
నిజామాబాద్ జిల్లాలో వరి వేసేందుకు రైతులు వెనుకాముందు అవుతు న్నారు. ఇది వరకే నారు మడులు వేసుకున్న వారివి ముదిరి పోతుండగా.. 15 రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షాలను చూసి మరికొంత మంది రైతులు నారుమడులు వేసుకున్నారు. ఒక్క భారీ వర్షం కురవకపోదా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5.58 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగువుతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా.. సాగు గడువు మించిపోతున్నా ఆ లక్ష్యం చేరే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటి వరకు వరి 4.38 లక్షల ఎకరాలకు గాను ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 5.59 లక్షల ఎకరాలకు గాను.. వరి 3.20 లక్షల ఎకరాల్లో సాగవనున్నట్టు అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటివరకు వరి 68 వేల ఎకరాల్లో నాట్లు పూర్తయింది.



