పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ
కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు
దర్శించుకున్న ప్రముఖులు, తరలివచ్చిన భక్తజనం
దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలోని బల్కంపేట శ్రీఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ వేడుకను వీక్షించేందుకు నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. అనంతరం అమ్మవారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా, వైభవంగా చేశారు.
తరలివచ్చిన ప్రముఖులు
ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు, మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి, శాసనసభ్యులు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ తదితరులు విచ్చేయగా, దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు.
మెరుగైన వసతుల కల్పన
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దేవాదాయ శాఖ అన్ని రకాల వసతులనూ ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ చైర్మెన్ సాయిబాబా పర్యవేక్షణలో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి కల్పించారు. ప్రతి ఒక్కరికీ అమ్మవారి కల్యాణం స్పష్టంగా కనిపించేలా, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా లైన్లను క్రమబద్ధీకరించారు. కల్యాణం ముగిసిన తర్వాత కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చారు. పలు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, ట్రాఫిక్ డీసీపీ కాజల్ సింగ్, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, ఈవో వినోద్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



