- మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఐతరాజు అభయేందర్
నవతెలంగాణ-చండూరు: చర్లగూడెం భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీఎస్పీ పోరాటం ఆగదు అని మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఐతరాజు అభయేందర్ హెచ్చరించారు. బుధవారం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన చర్లగూడెం ప్రాజెక్టు వద్ద మర్రిగూడ మండల బీఎస్పీ అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఐతరాజు అభయేందర్ మాట్లాడుతూ చర్లగూడెం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ చట్టం ప్రకారం పూర్తి ఆర్అండ్ఆర్ (R&R) ప్యాకేజీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి అర్హ కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు, నిర్వాసిత కుటుంబాలకు చెందిన చదువుకున్న యువతకు శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
ప్రాజెక్టు కోసం భూములు సేకరించి ఎన్నో సంవత్సరాలు గడిచినా పనులు పూర్తి కాకపోవడం గత, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి బాధాకరమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూ నిర్వాసితులు, రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించిన ఆయన, ప్రజల సమస్యల పరిష్కారం కంటే మంత్రి పదవిపైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు.
మునుగోడు నియోజకవర్గం మొత్తం ఫ్లోరైడ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజల ఆరోగ్యం, సురక్షిత తాగునీటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. చర్లగూడెం భూ నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ వారి పక్షాన రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఐతరాజు అభయేందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ బొట్ట శివ, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుక్క రాములు, నారాయణపురం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షుడు మస్కు ఉదయ్, నాయకులు పల్లేటి రతివ, ఈద నరేష్, సురేష్, విజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.


