‘‘వాగ్దానాలు వినిపిస్తున్నాయి… సమావేశాలు జరుగుతున్నాయి… ప్రకటనలు వస్తున్నాయి… కానీ పీఆర్సీ మాత్రం కనిపించడం లేదు’’ నేడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మనసులో వినిపిస్తున్న నిశ్శబ్ద ఆవేదన ఇదే. ఒకప్పుడు ప్రతి వేతన సవరణ ఉద్యోగుల జీవితంలో కొత్త ఆశలను నింపేది. కానీ, ఇప్పుడు పే రివిజన్ కమిషన్ (పిఆర్సి) అనే మాట ఆశ కంటే అనిశ్చితికే ప్రతీకగా మారుతోంది. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే ఉద్యోగులే ప్రధాన బలం. ‘‘పల్లె పాఠశాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ల కార్యాలయం వరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించేది ఉద్యోగులే. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి కృషి వల్లే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. అలాంటి ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పీఆర్సీ నిరవధికంగా ఆలస్యం కావడం సహజంగానే ఆందోళనకు దారితీస్తోంది. గత కొన్నేళ్లుగా జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు, గృహ అద్దెలు-ప్రతి కుటుంబం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఉద్యోగుల ఆదాయం మాత్రం అదే వేగంతో పెరగడం లేదు. వేతన సవరణ ఆలస్యం కావడంతోపాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆరు డిఏ లు పెండిం గ్లో ఉన్నాయి. ఈ ఆరు డి.ఎ.లు మొత్తం కలిపితే పీఆర్సీ ఫిటమెంట్లో యాభై శాతం వరకు ఉంటుంది. రావలసిన వీటి లోటుతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.
పీఆర్సీ అనేది ప్రభుత్వం ఇచ్చే దాతృత్వం కాదు. ఉద్యోగుల సేవలకు కాలానుగుణంగా ఇచ్చే న్యాయమైన గుర్తింపు. ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడం, సేవా ఉత్సాహాన్ని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి దీన్ని ఆలస్యం చేయడం అనేది వేలాది కుటుంబాల ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేసే అంశం.ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాయి, వినతిపత్రాలు అందజేశాయి, చర్చలూ నిర్వహించాయి. అయినప్పటికీ స్పష్టమైన కాలపట్టిక లేకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది. అనిశ్చితి ఎప్పుడూ అసంతృప్తికి దారితీస్తోంది. అసంతృప్తి పని సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.ప్రభుత్వం కూడా తనవైపు ఆర్థిక పరిమితులు, సంక్షేమ పథకాల భారం, ఆదాయ-వ్యయ సమతుల్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటుందనేది వాస్తవం. కానీ, ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ఉద్యోగుల న్యాయమైన ఆశలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిష్కారం కాదు. పరిపాలనలో ఉద్యోగులు భాగస్వాములు, వారిని భాగస్వాములుగానే చూడాలి.
ప్రభుత్వం-ఉద్యోగుల సంబంధం విశ్వాసంపై నిలబడాలి. ఆ విశ్వాసాన్ని బలపరచేది పారదర్శకత. పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ, కాలపట్టిక, అమలు విధానాన్ని ప్రకటిస్తే ఉద్యోగుల్లో ఉన్న అనిశ్చితి తొలగుతుంది. నిర్ణయం ఆలస్యం కావడం కంటే, స్పష్టత లేకపోవడమే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలలోనే పీఆర్సీని అమలు చేస్తామని హామీ నిచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి సుమారు మూడేండ్లు దగ్గర పడుతున్నా, కేవలం కమిషన్ వేసి ఎంతో ఆర్భాటంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సలహాలు సూచనలు లిఖిత పూర్వకంగా తీసుకుంది. కానీ, కనీసం కమిషన్ రికమండేషన్స్ కూడా బహిర్గతం చేయకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వాలు పీఆర్సీలు ఆలస్యం చేయడం వల్ల సుమారుగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ ఉద్యోగ జీవితంలో రెండు పీఆర్సీ లను కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగి గౌరవం కాపాడబడితేనే ప్రభుత్వ పరిపాలన మరింత బలపడుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ప్రతి ఉద్యోగి, ప్రతి కుటుంబం ఆశిస్తోంది.
బొల్లం సునీల్ కుమార్



